02-12-2025 02:44:14 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలుని, తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిద్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడ.. లేక అవివేకవంతుడా.. అని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నారు. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడడం దురదృష్టకరమని ఆయన విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగిందని, మేము ఆంధ్ర ప్రజలను తప్పు పట్టడం లేదు కాదా అని అన్నారు. ఆది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నామని, అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమని పవన్ కళ్యాణ్ పై మంత్రి మండిపడ్డారు.
వెంటనే పవన్ కళ్యాణ్ తన మాటలు ఉప సంహరించుకుని క్షమాపణలు కోరాలని, భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడకుండా విజ్ఞతగా వ్యవహరించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని మంత్రి పొన్నం తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రులు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటీ శ్రీహరి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అద్ధంకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో పాటు పలువురు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.