03-07-2025 12:48:07 AM
పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ములుగు, జులై2 (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
శ్రీసమ్మక్క సారలమ్మ జాతర తేదిలను ప్రకటించిన పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కోట్ల మంది భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగ కుండా విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పుడు మహజాతర తేదీలను ప్రకటించడంతో పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రూ.110 కోట్లతో మేడారంలో అభివృద్ది పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సారలమ్మ,గోవిందరాజు,పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు.
29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6గంటలకు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరిగే మహా జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మేడారంలో శాశ్వత అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు.