calender_icon.png 13 May, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లుల వద్ద ధాన్యం సేకరణలో అలసత్వాన్ని వీడాలి

12-05-2025 10:28:41 PM

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలి

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం

ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో 2024-25 రబీ వరి సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సి కూచకుళ్ళ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారో అధికారులు అడిగి తెలుసుకున్నారు.

పారదర్శక పాలన అందించేందుకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే తూకం వేసి  ధాన్యం విలువ తెలిసేలా, డబ్బుల విలువతో రసీదు కొనుగోలు కేంద్రంలోనే వారికి అందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఏ చిన్న పొరపాట్లు రానివ్వద్దని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు, సన్న రకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 500 చొప్పున బోనస్ అందించనుంది తెలిపారు.. దీనిని దృష్టిలో పెట్టుకుని సన్న ధాన్యంలో దొడ్డు రకం వడ్లు కలువకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వేర్వేరు కేంద్రాల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని సూచించారు.

ప్రతి కొనుగోలు కేంద్రానికి కోడ్ నెంబర్ కేటాయిస్తూ, ఏ రకం ధాన్యం మిల్లులకు పంపిస్తున్నారన్న వివరాలను ధాన్యం బస్తాలపై రాయాలని అన్నారు. దీనివల్ల రైసుమిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వల్లో ఏవైనా అవకతవకలు జరిగితే, అవి ఏ కొనుగోలు కేంద్రం ద్వారా కేటాయించబడ్డాయన్నది సులువుగా నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్నివెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలో వారి ఖాతాలలో బిల్లులకు సంబంధించిన డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు.

ఎవరైనా రైతును మోసగించేందుకు, నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సరిపడా సంఖ్యలో సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకుని వెంటనే  ధాన్యం తూకం జరిగేలా, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు రవాణా జరిగేలా చొరవ చూపాలన్నారు. రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ కు సూచించారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా అర్ధాంతరంగా మూతబడకుండా, రైతుల నుండి చివరి ధాన్యం గింజను సైతం కొనుగోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు.

పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలన్నారు. రైస్ మిల్లర్ ల నుండి రైతులకు ఎలాంటి మోసం జరుగకుండా చర్యలు చేపట్టాలని,రైతులకు మేలు జరిగేలా జవాబుదారీతనంతో అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. దళారీ వ్యవస్థను అరికట్టడం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. గన్ని బ్యాగులలో మోసం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా చర్యలు 

చేపట్టాలని అధికారులను ఆదేశించారు

జిల్లా లోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గంలో వరి ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైస్ మిల్లు యజమానులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిఆర్డివో చిన్న ఓబులేసు, పౌర సరఫరా శాఖ మేనేజర్ రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్,ప్రజా ప్రతినిధులు, రైస్ మిల్లు యజమానులు, తదితరులు పాల్గొన్నారు.