calender_icon.png 5 July, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి..

05-07-2025 04:48:25 PM

డిజిటల్ పాఠశాలగా మంథని జడ్పిహెచ్ఎస్ ను తీర్చిదిద్దాలి..

ఏఐ టూల్స్, స్పోకన్ ఇంగ్లీష్ పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించాలి..

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha)తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మంథని జూనియర్ కళాశాల మైదానంలో రూ. 35 లక్షల నిధులతో చేపట్టిన సింథటిక్ టెన్నిస్ కోర్టును, రూ. 10 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులకు రూ. 4 కోట్ల 5 లక్షల 50 వేల రూపాయలతో చేపట్టిన రావుల చెరువు బ్యూటిఫికేషన్ పనులకు, రూ. 2 కోట్ల 99 లక్షల రూపాయలతో చేపట్టిన అయ్యగారి చెరువు బ్యూటిఫికేషన్ పనులకు, గంగపురి వద్ద రూ. 2 కోట్ల 55 లక్షల రూపాయలతో చేపట్టిన 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. 

మంథని పట్టణంలోని బోయిన్ పేట వద్ద రూ. 12 లక్షల రూపాయలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్, పోచమ్మ వాడ పాల కేంద్రం వద్ద ఉష ఇంటర్నేషనల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మహిళ కుట్టు శిక్షణ కేంద్రాన్ని, సీతారామ సేవా సదన్ సౌజన్యంతో మంత్ర పురి పరిసర గ్రామ ప్రజలకు బ్రహ్మ తీర్థం ముక్తి దామం (గ్యాస్ ఆధారిత జ్వలన యంత్రం), జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో సీడ్స్ ఎన్.జి.ఓ ద్వారా రూ. 58 లక్షలతో నిర్మించిన అధునాతన డిజిటల్ క్లాస్ లు, లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... విద్యా, వైద్యం రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అన్నారు.  పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నమ్మకం కలిగిస్తూ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, మంథని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 25 మంది కొత్త విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చి చేరడం చాలా సంతోషకరమని అన్నారు. 

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు తన వంతు ప్రయత్నం చేస్తానని మంత్రి తెలిపారు.  మెగా డీఎస్సీ నిర్వహించి నూతనంగా రూ. 10 వేల  పైగా ఉపాధ్యాయ పోస్టులను మనం భర్తి చేశామని, రూ. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఎక్కడ ఎటువంటి ఆరోపణలు రాకుండా పారదర్శకంగా పూర్తి చేసామని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నూతన సాంకేతికతను నెర్పించాలనే లక్ష్యంతో మంథని బాలికల పాఠశాలలో రూ. 58 లక్షలతో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు.

ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ మన విద్యార్థులకు అందుబాటులో ఉందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను అలవాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయాలని, నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తామని, రోబోటిక్స్, డ్రైవర్ లెస్ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని, మంథని లో ఉన్న ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ను  విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు. ఏఐ టూల్స్ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందన్నారు.

టీచర్స్ కు కూడా ఏ.ఐ బోధనపై శిక్షణ అందిస్తామని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, మంథని పాఠశాలలో టీచర్లకు డిజిటల్ స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేస్తామని, మంథని పట్టణంలో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేశామని, 30 మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. స్థానిక యువతకు, విద్యార్థులకు నైపుణ్యాలు పెంచితే పరిశ్రమలు కూడా ఇక్కడ అధికంగా వస్తాయని, పాఠశాలలో ఉన్న మిగిలిన క్లాస్ రూమ్ లను కూడా డిజిటల్ చేయాలని,  డిజిటల్ పాఠశాలగా మంథని జడ్పిహెచ్ఎస్ ను తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు.

పిల్లలు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని, పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించాలని, దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్, ఎంపిడిఓ, నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.