calender_icon.png 23 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపోల్స్‌తో మంత్రులు ఉక్కిరి బిక్కిరి!

23-01-2026 01:22:44 AM

పురపోరులో ప్రతికూల ఫలితాలు వస్తే పరిస్థితి ఏంటి?

ఒక వైపు సొంత జిల్లా.. మరోవైపు పార్లమెంట్ ఇన్‌చార్జ్ బాధ్యతలు

తలకుమించిన భారంగా భావిస్తున్న అమాత్యులు 

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్, కార్పొరే షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పనిచేయడమంటే రెండు పడవల్లో కాళ్లు పెట్టి ప్రయాణించడంలా రాష్ట్ర మంత్రులు భావిస్తున్నా రు. మున్సిపోల్స్‌లో భారీసంఖ్యలో మున్సిపల్, కార్పొరేషన్ స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాం గ్రెస్ పార్టీ మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించింది. దీంతో సొంత నియోజకవర్గం, జిల్లాలోని మున్సిపాలిటీలను గెలిపించుకోవడంతో పాటు.. మరోవైపు ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్లమెంట్  నియోజక వర్గాల్లో పార్టీ విజ యం కోసం మంత్రులు పనిచేయాల్సి ఉంటుంది.

అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ ప్రతికూల ఫలితాలే వస్తే, ఆ ప్రభా వం తమపై పడుతుందనే భయం మంత్రులను వెంటాడుతోంది. మం త్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు.. పురపోరులో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసేవారు పదుల సంఖ్యలో ముందుకొ చ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మిగతావారిని ఒప్పించి.. ప్రజల్లో పట్టున్న వారినే ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు చూచించారు. ఈ విషయంలో ఎంత ప్రయత్నించినా, టికెట్ రానివారు రెబల్స్‌గా బరిలో ఉండేందుకు సిద్ధ్దమవుతారు.

ఇలాంటి సమయంలో ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రు లు కీలకంగా వ్యవహారించాల్సి ఉంటుంది. ఒకవేళ రెబల్స్ బుజ్జగింపులకు తలొగ్గకుండా బరిలోనే ఉంటే.. పార్టీ అభ్యర్థుల విజయంపైన ప్రభావం కనిపిస్తుంది. అది ప్రతికూలమైతే, ఫలితాల తర్వాత మిగిలేది తలవంపులేనని మంత్రులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు.. పురపోరులో జరగకుండా చూ డాల్సి బాధ్యత కూడా మంత్రులపైనే పెట్టా రు. ఇది తమకు ఒక టాస్క్‌గానే ఉంటుందని కొందరు మంత్రులు అంతర్గతంగా ఆందోళన  చెందుతున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక్కో డివిజన్‌కు ఒక మంత్రికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.

దీనితోపాటు 100 ఓట్లకు ఒక పార్టీ నాయకుడిని నియమించడం వల్లే విజయం సాధ్యమైందనే విషయం వారు గుర్తుచేస్తున్నారు. కానీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నిక ల్లో ఇటు సొంత జిల్లాలు, అటు ఇన్‌చార్జ్‌గా వ్యవహారించనున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కేడర్‌ను సమన్వయం చేయడం, రెండుచోట్లా అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయడం అంత సులువైన పనేమి కాదనే చర్చ జరుగుతోంది. ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.