calender_icon.png 23 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములవుతాం

23-01-2026 01:23:00 AM

  1. హైదరాబాద్‌లో ప్రతిభావంతమైన మానవ వనరులు
  2. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎండీ జెరెమీ జర్గెన్స్
  3. సీఎం రేవంత్‌రెడ్డితో దావోస్ వేదికగా భేటీ

  4. ముగిసిన తెలంగాణ బృందం దావోస్ పర్యటన
  5. అమెరికా పర్యటకు సీఎం.. మంత్రులు, అధికారుల బృందం స్వదేశానికి..

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో తాము భాగస్వామ్యం అవుతామని వర ల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ చెప్పారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చా రు. హైదరాబాద్‌లో ప్రతిభావంతమైన మా నవ వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశ మయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జన వరిలో జరిగే దావోస్‌లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో అప్ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఫాలో అప్ ఫోర మ్ నిర్వహించాలని కోరారు.

సీఎం ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ  దేశా ల నుంచి  ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్, లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్‌లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు.  అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. 

హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను విశ్లేషించారు. క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరా బాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు.  

సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి

తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి  కాలుష్యం లేని విద్యుత్ (క్లీన్ ఎలక్ట్రిసిటీ), గ్రీన్ హైడ్రజన్ అందిచాలనే  ప్రణాళికలు ప్రభుత్వం రూ పొందిస్తున్నది అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  

దావోస్ పర్యటన విజయవంతం 

‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరా బాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. మూడు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది.

రల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్య క్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. 

జూరిక్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి

 మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రము ఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావో స్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దావోస్‌లో కార్యక్రమాలు ముంగిం చుకొని సీఎం రేవంత్ రెడ్డి జూరిక్ బయల్దేరారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగు పయనమయ్యారు.

3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

టెక్నాలజీ, నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం, సుస్థిర పట్టణాభివృద్ధి, 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో, ఎండీ కే. కృత్తివాసన్‌లతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం -టాటా గ్రూపుల మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత విస్తృత పర్చే విషయమై లోతుగా చర్చించారు. 

సమావేశంలో మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ స్సెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ స్సెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, ప్రభుత్వ ఐటీ అడ్వయిజర్ సాయికృష్ణ కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం తెలంగాణాలో లక్షకు పైగా ఉద్యోగులు ఉన్న టాటా గ్రూప్, ఈ కొత్త రంగాల్లో తన భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. నూతన టెక్నాలజీ అభివృద్ధిలో రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టాటా గ్రూప్ అధ్యక్షుడు నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.