calender_icon.png 10 September, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాయ్ టికెట్ ధరలు ఆ ఉద్దేశంతోనే పెంచలేదు

10-09-2025 12:00:00 AM

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా విజువల్ వండర్ మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ మనోజ్ మంచు ప్రతినాయక పాత్ర పోషించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర విశేషాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరులతో పంచుకున్నారు. 

-నేను 2017లో ఇండస్ట్రీలోకి వచ్చాను. 2018 నుంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రతి ఏడాది మాకు మంచి సక్సెస్‌లుంటాయి. కానీ 2024 నిరాశ పర్చింది. ఇప్పుడు ‘మిరాయ్’తో కమ్‌బ్యాక్ ఇస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. 

-మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘మిరాయ్’ చేశాం. ఈ సినిమా ప్రారంభించేటప్పటికి తేజ ‘హనుమాన్’ ఇంకా రాలేదు. మేము ప్రోడక్ట్‌ను నమ్మాం. ఇందులో దాదాపు ఒక పది భారీ ఎపిసోడ్స్ ఉంటాయి. మంచి కథ, మ్యూజిక్, గ్రేట్ లొకేషన్స్, గ్రాఫిక్స్ వర్క్ మరోస్థాయిలో ఉంటుంది.  

-నేను చిన్నప్పుడు చందమామ కథలు, అమరచిత్ర కథలు అంటే చాలా ఇష్టపడేవాన్ని. ఆ కథలన్నీ మన రామాయణ, మహాభారత ఇతిహాసాలకు ముడిపడి ఉంటాయి. ‘మిరాయ్’ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతోపాటు ఫిక్షన్ కూడా కలిసి ఉన్న కథ ఇది.

ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ ఇది. -కార్తీక్ కథ చెప్పగానే చాలా నచ్చింది. అశోకుడు మొత్తం జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. అందులో వాటి రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒక పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యత ఏమిటి? వాటి గురించి హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనే అద్భుతంగా ఉంటుంది.

-తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. థాయిలాండ్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మనోజ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. చాలా అనుభవం ఉన్న నటీనటులు ఇందులో భాగమయ్యారు. 

-కార్తీక్ బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్. తనకు లోకేషన్‌లో ఏం కావాలి? సెట్లో ఏం ఉండాలి, ఏవి గ్రాఫిక్స్‌లో ఉండాలనే ఫుల్ క్లారిటీ ఉంది. ఈ సినిమాలో లోకేషన్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

-ఈ సినిమాలో ప్రతి అంశానికి, పాత్రకు ఒక కారణమనేది ఉంటుంది. ప్రతి పాత్ర సృష్టీ సహజసిద్ధంగా అనిపిస్తుంది. ప్రతి సీక్వెన్స్‌కు చాలా అద్భుతమైన కనెక్షన్ ఉంటుంది.  డైరెక్టర్ కార్తీక్ ఫాంటసీ స్టోరీ టెల్లింగ్, మంచి కనెక్షన్‌తో సినిమాను తీశాడు. 

-బిగ్ కాన్వాస్ ఉన్న చిత్రమిది. అందుకే -నేను డీప్‌గా ఇన్వాల్వ్ అయి చేశాను. ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నాను. వీఎఫ్‌ఎక్స్ మా సొంత కంపెనీలోనే చేశాం. గ్రాఫిక్స్ బయటికిస్తే చాలా ఇష్యూస్ ఉంటాయి. చివరికి వాళ్లు ఇచ్చిందే తీసుకోవాలి. మనం ఇన్‌హౌస్ చేస్తే మనకు కంట్రోల్ దొరుకుతుంది. 

-చాలా కాంప్లెక్స్‌గా అనిపించిన ఒక సీక్వెన్స్ ఉంది. ఇందులో సంపాతి అనే ఒక పక్షి ఉంటుంది. దీనికోసం ఒక చాలా పెద్ద ఫ్లోర్ ఉన్న సెట్ కావాల్సి వచ్చింది. ‘రాజాసాబ్’ వన్ అఫ్ ది లార్జెస్ట్ ఫిలిం షూటింగ్ ఫ్లోర్. ‘మిరాయ్’ కోసం చేసిన సీక్వెన్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్లోర్.. 30 వేల స్క్వేర్ ఫీట్‌లో ఉంటుంది. అందులో ఒక సెట్ వేశాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో చేశాం. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్. పక్షితో ఇంతలా హ్యూమన్ ఇంటరాక్షన్ ఉన్న సినిమా ఇప్పటికీ రాలేదని భావిస్తున్నా.  

‘-మిరాయ్’ కంటెంట్‌కు అన్ని వైపుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కరణ్ జోహర్ సినిమా కంటెంట్ చూశారు. చాలా నచ్చిందని చెప్పారు. దీంతో ఆయన నార్త్‌లో రిలీజ్ చేస్తున్నారు. -శ్లోకతో కలిసి యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నాం. కర్ణాటకలో హోంబాలే, కేరళలో గోకులం, తమిళనాడులో ఏజీఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. 

-ఈ సినిమా స్కేల్, సైజ్‌కు టికెట్ల ధరలు ఎక్కువగా తీసుకోవచ్చు. సినిమా చూసిన ప్రేక్షకులకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన చిత్రం అనిపిస్తుంది. కానీ మేము టికెట్ ధర పెంచాలని అనుకోవడం లేదు. సాధారణ ధరలే ఉంటాయి. ఈ సినిమానున ఎంతమంది చూడాలనే దానిపైనే మా దృష్టి ఉంది. కుటుంబ ప్రేక్షకులు పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం.

-ఇక మా బ్యానర్‌లో రూపొందుతున్న ‘-రాజాసాబ్’ జనవరి 9న వస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘కాంతార2’తో రిలీజ్ చేస్తున్నాం. ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇంకా మా సంస్థ నుంచి కొత్తగా చేస్తున్న సినిమాలంటే.. ‘తెలుసు కదా’ వచ్చే నెల రిలీజ్ అవుతుంది. తర్వాత ‘మోగ్లీ’ ఉంటుంది. లావణ్య త్రిపాఠితో ఒక థ్రిల్లర్, సునీల్‌తో మరో సినిమా చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే వస్తాయి. ‘గూఢచారి2’, ‘గరివిడి లక్ష్మి’, కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. 2026 మధ్య మా సంస్థ నుంచి దాదాపు 12 సినిమాలు విడుదలవుతాయి.