20-08-2025 06:37:31 PM
వర్షాలతో జరిగిన నష్టం గుర్తించండి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంకు చెందిన పలు శాఖల అధికారులతో బుధవారం మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులోని రైతు వేదికలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండలంలోని పలు సమస్యల పై ఆయన ఆరా తీశారు. అల్పపిడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ పై అధికారులు ద్రుష్టి సారించాలని ఆదేశించారు. భారీ వర్షాలతో గ్రామాల్లో దెబ్బతిన్న అంతర్గత రోడ్లును గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు రోడ్ల మీదకి రావాలని, రైతులు అప్రమత్తoగా ఉండాలి విధ్యుత్ తీగలను పంట పొలాల్లో చూసుకొని జాగ్రత్తగా పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని, దోమల బెడద పెరిగే అవకాశం ఉన్నందున నీళ్లు నిల్వ లేకుండా బ్లీచింగ్, దోమల స్ప్రేయింగ్, శానిటేషన్ గ్రామాల్లో చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్న సందర్బంగా ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని, ముఖ్యగా ప్రజలు వాగులు దాటే సమయంలో సాహసలు చేస్తూ ప్రమాదలకు గురికావొద్దని తెలిపారు.
విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ సక్రమంగా అందించాలని, తప్పు జరిగితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ సెక్రటరీలు ఎప్పటికపుడు గ్రామాల్లో పారిశుద్యం, బ్లీచింగ్ వంటి పనులను తప్పక చేయించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, ఇంకా పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు.