02-08-2025 06:01:09 PM
ట్రైబల్ జర్నలిస్టులకు ఎమ్మెల్యే మురళి నాయక్ పిలుపు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): గిరిజన సమాజ ప్రగతికి, సంక్షేమానికి ట్రైబల్ జర్నలిస్టులు తమ కలం ద్వారా అండగా నిలవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పిలుపునిచ్చారు. ఈనెల 8న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(టీ.డబ్ల్యూ.జే.ఏ) జిల్లా ద్వితీయ మహాసభ కరపత్రాన్ని శనివారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి ఆకాంక్షలను ప్రభుత్వాలకు వినిపించడంలో గిరిజన జర్నలిస్టుల పాత్ర ఎంతగానో అవసరమన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, సమస్యలను ప్రపంచానికి చాటిచెప్పడంలో జర్నలిస్టులు వెన్నుదన్నుగా నిలవాలని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వం అన్నివిధాలా తోడుంటుందని హామీ ఇచ్చారు.
అగ్ని గుండంలాంటి సమాజ సమస్యలను తమ రచనల ద్వారా పరిష్కరించాలని, పదునైన ఆయుధమైన కలం ద్వారా అన్యాయాన్ని ఎదిరించాలని ఆయన ఉద్బోధించారు. ఈ మహాసభలు గిరిజన జర్నలిజానికి ఒక కొత్త దిశను చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజనుల జీవితాల్లో జ్యోతిలా వెలుగులు నింపేందుకు జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జే.ఏ ఆహ్వాన కమిటీ జిల్లా కన్వీనర్ బానోతు లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాటి సుదర్శన్, ఆహ్వాన కమిటీ కో కన్వీనర్లు మహేందర్ నాయక్, వెంకటేష్, బాలు నాయక్, బోడ శరత్ నాయక్, మోహన్, శ్రీనివాస్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు.