calender_icon.png 2 August, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండోమెంట్‌లో రామాల‌యం విలీనం దుర్మార్గపు చ‌ర్య‌

02-08-2025 08:02:25 PM

నోటీసులు లేకుండానే అధికారుల దౌర్జ‌న్యం..

జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే ప‌ద్మారెడ్డి

మెద‌క్‌ (విజ‌య‌క్రాంతి): భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మెద‌క్ ప‌ట్ట‌ణంలోని కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Former MLA Padma Devender Reddy) మండిపడ్డారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కొదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలినాన్ని నిరసిస్తూ శనివారం రామాలయం ముందు రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, భక్తులతో బైటాయించి రాస్తారోకో  చేపట్టారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రజలు, భక్తుల విరాళాలతో గత 49 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న దేవాలయానికి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు.

దినదినాభివృద్ధి చెందిన రామాలయంలో ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణం, వేడుకలతో పాటు శ్రావణ మాస తదితర పూజలు భక్తుల సహకారంతో పాటు దేవాలయ కమిటీ ఆద్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకు పోలీసుల బందోబస్తుతో దేవాదాయ శాఖ అధికారులు దొంగల్లా హుండీతో పాటు దర్శసత్రాన్ని సీజ్‌ చేయడం సరికాదన్నారు. ఈ ఆలోచనను దేవాదాయశాఖ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శిధిలావస్థలో గల దేవాలయాలను పట్టిచుకోకుండా భక్తుల సహకారంతో అభివృద్ధి చెందిన దేవాలయాలను స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం కక్ష్య సాధింపు చర్యలతోనే శ్రీ కొదండ రామాలయాన్ని విలీనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగానే దేవాదాయశాఖకు అప్పగించిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి,పట్టణ కన్వీనర్ మామిళ్ల. ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, న్యాయవాది.జీవన్ రావు, మాజీ కౌన్సిలర్లు జయ రాజు,ఆర్కే శ్రీనివాస్, మాయ. మల్లేశం, విజయలక్ష్మి, హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కిష్టయ్య, ఆంజనేయులు, శంకర్, తుమ్మ లక్ష్మీనారాయణ, శ్రీనివాస్,మోహన్, గట్టేష్, నగేష్, ఇస్మాయిల్, నరేందర్ రెడ్డి, కిష్టారెడ్డి, బిఆర్ఎస్ యువ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.