09-07-2025 05:56:43 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) అన్నారు. బుధవారం అమీర్ పేట లోని మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని యువసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్ధం ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా తలసాని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి రోజు క్రీడల పట్ల కూడా కొంత సమయం కేటాయించడం వలన శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారని చెప్పారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఏ క్రీడలపట్ల ఆసక్తి ఉందో గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. తమ ప్రతిభను చాటేందుకు ఇలాంటి క్రీడాపోటీలను వేదికలుగా మార్చుకోవాలని చెప్పారు. గడిచిన 9 సంవత్సరాల నుండి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న సచిన్, అతని బృందాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి ఇంటర్ కాలేజ్ లెవెల్ లో జరిగే ఈ పోటీలలో సుమారు 100 టీమ్ లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట BRS పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, శ్రీనివాస్ గౌడ్, బాబా గౌడ్, ప్రకాష్ గౌడ్, సచిన్, రాహుల్, పరమేష్, అబ్రహం, రాకేష్, అర్జున్ తదితరులు ఉన్నారు.