calender_icon.png 10 July, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి

09-07-2025 09:07:40 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బాలలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. మండలాల వారీగా ఎంఈఓలు ప్రతి పాఠశాలలో ఈ చట్టంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. 2012లో అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలలపై లైంగిక నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఈ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా చట్టం రూపొందించబడిందని తెలిపారు. 

కార్యక్రమంలో పాల్గొన్న నిపుణుడు డేవిడ్ రాజు ఉపాధ్యాయులకు పోక్సో చట్టం, పాఠశాలల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధికారులు పోక్సో చట్టంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాల్గొన్న విద్యార్థులు, వక్తలకు, ఎన్‌సీసీ సభ్యులకు కలెక్టర్ జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీవాణి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.