09-07-2025 08:51:34 PM
సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణకై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సిపిఎం, సిపిఐ, సిపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ ప్రజా పందా జిల్లా కార్యదర్శులు సాదుల శ్రీనివాస్, బి.విజయ సారధి, గౌని ఐలయ్య, పాయం చిన్న చంద్రన్న, సనప పొమ్మయ్యలు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సక్సెస్ అయ్యింది. కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు కార్మిక సంఘాల నాయకులు ఆకుల రాజు, రేషపల్లి నవీన్, పర్వత కోటేష్, కొత్తపల్లి రవి, ఎస్.కె మదర్ అధ్యక్షత వహించారు.
ఈ సభలో వక్తలు మాట్లాడుతూ.. కార్మిక వర్గం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా చేసిందన్నారు. దీంతో కార్మికుల హక్కులు కాలరాయపడుతున్నాయని, ఈ 4 లేబర్ కోడ్ ల వెనుక కార్మికుల జీతాల తగ్గింపు, పని భద్రత లేకపోవడం, పర్మినెంట్ ను రద్దు చేసి కాంట్రాక్టు వ్యవస్థ, సంఘాల ఏర్పాటుకు నిషేధం, సమ్మెలకు అనుమతి నిరాకరణ వంటి కార్మికుల పొట్టలు కొట్టే నిర్ణయాలు ఉన్నాయన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి ఉద్యోగ భద్రత పర్మినెంట్ వ్యవస్థలు లేకుండా మోడీ ప్రభుత్వం లేకుండా చేస్తుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడం కోసం 282 జీవోను తీసుకువచ్చి 10 గంటల పని విధానాన్ని రుద్దే ప్రయత్నాలను కార్మిక వర్గం గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ ఐఎఫ్ఎస్సి, టియుఐసి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, బి.అజయ్, బిల్లకంటి సూర్యం, హలవత్ లింగన్న, కుమ్మరి కుంట్ల నాగన్న లు కోరారు.