calender_icon.png 10 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం నుంచి కృష్ణ‌మ్మ ప‌రుగులు.. నాగార్జున సాగ‌ర్‌కు జ‌ల‌క‌ళ‌

09-07-2025 09:48:17 PM

నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు..

వేగంగా నిండుతున్న సాగర్‌.. 538 అడుగులు దాటిన నీటిమట్టం

నాగార్జునసాగర్ (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాలా, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లుఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువనుంచి జూరాల ప్రాజెక్టుకు లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.95 టీఎంసీలుగా ఉంది. అదనంగా వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల నుంచి వస్తున వరదనీటితో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులకు చేరింది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగ‌ర్‌కు కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. శ్రీశైలం గేట్లు ఎత్త‌డంతో సాగ‌ర్ వైపు కృష్ణ‌మ్మ బిరాబిరా ప‌రుగులు పెడుతోంది. దీంతో నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఎగువనుంచి 1లక్షా 17వేల 868 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి 4 వేల 646 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు.