26-10-2025 08:20:56 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): తాము చదువుకున్న పాఠశాలకు గురుతర బాధ్యతగా రేకుల షెడ్డు నిర్మాణం చేయడం అభినందనీయం అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. 50 వసంతాల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 50 వసంతాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై తమ అనుభూతులు పంచుకున్నారు. 1976 సంవత్సరంలో పదో తరగతిలో విద్యాభ్యాసం అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలనాటి గురువులను సన్మానించే తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1975-76 సంవత్సరంలో విద్యను అభ్యసించిన అలనాటి పూర్వ విద్యార్థులు సుల్తానాబాద్ మండలం నరసయ్య పల్లి లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై నిర్వహణ కమిటీకి అభినందనలు తెలియజేశారు. గురువులను సన్మానించిన అనంతరం 50 సంవత్సరాల తర్వాత చిన్ననాటి గురుకులను నెమరేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. కుటుంబ సభ్యులతో సహా చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నప్పటికి తరగతి విషయాలను గుర్తు చేస్తూ, తరగతి గదిలో ఎట్లాగైతే అటెండెన్స్ తీసుకుంటారో ఉపాధ్యాయులు కూడా నేటి కార్యక్రమంలో అటెండెన్స్ తీసుకోవడం హైలెట్గా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ... 50 వసంతాల తర్వాత తమ మిత్రులతో కలిసి ఒకరోజు గడపడం చాలా అభినందనీయమని, తాము చదువుకున్న కళాశాలకు లక్ష రూపాయల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మాణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.
ఏడుపదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గురువులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... అలనాటి చిన్నారులు ఇప్పటికీ మమ్ములను గుర్తించుకొని ఈ విధంగా సన్మానం చేయడం చాలా ఆనంద దాయకం అని అన్నారు. క్రమశిక్షణతో చక్కగా చదివి నేడు ఉన్నత స్థానంలో ఉన్న శిష్యులను చూసి గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు బౌద్ధుల లక్ష్మయ్య, అల్లాడి వెంగళరావు, కార్యక్రమ నిర్వాహకులు కందుకూరి ప్రకాష్ రావు, డాక్టర్ మధుకర్, కొత్తిరెడ్డి కమలాకర్ రెడ్డి, మాలహాల్ రావు ఏ లక్ష్మీనారాయణ, జిఎల్ నరేందర్, చిలగాని లక్ష్మయ్య,కాసిం, డాక్టర్ మల్లేశం, నసిరుద్దీన్, లక్ష్మీనారాయణ, శంషా, వసంత, అంజలి, కమల, తదితరులు పాల్గొన్నారు.