30-01-2025 01:57:38 AM
రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గానికి..
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని మూడు ఎమ్మె ల్సీ స్థానాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మెద క్,- నిజామాబాద్,- ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరగనుంది.
వరంగల్,- ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించను న్నారు. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు కొత్తవారిని ఎన్నుకునేందుకు వీలుగా ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నిక ప్రక్రియను మార్చి 8వ తేదీ వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
రాష్ర్టంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.