17-10-2025 09:07:28 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): దీపావళి పండుగను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల ఆరోగ్యానికి ముప్పుగా మారిన జంక్ ఫుడ్‌లను ఆధునిక నరకాసురుడిగా ప్రతీకాత్మకంగా చూపిస్తూ, “జంక్ ఫుడ్ నరకాసురుని బొమ్మ దహన కార్యక్రమం”ను విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల్లో జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యపరమైన సమస్యలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రిన్సిపాల్ లావణ్య నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సౌభాగ్య, వీణ, సునీత, సుష్మా, రేఖ, మౌనిక, గౌతమి, సవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు స్వయంగా నినాదాలు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే సందేశాన్ని అందించారు.