calender_icon.png 6 July, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా మేడారం ఆధునీకరణ

06-07-2025 12:36:18 AM

  1. పూజారుల సంఘం సూచనలతోనే ముందుకెళ్తాం
  2. మేడారం మాస్టర్ ప్లాన్ సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు, సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను పూజారుల సంఘం సలహాలు, సూచనల ఆధారంగా అమలు చేయాలని సూచించారు. మేడారం మాస్టర్ ప్లాన్‌పై శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు.

దేవాదా య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం అధ్య క్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్, ఆర్కిటెక్చర్స్ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం మాస్టర్ ప్లాన్‌పై కీలక సూచనలు చేశారు. ఆదివాసీల విశ్వాసాలను గౌరవించే విధంగా అభివృద్ధి పనులు ఉండాలన్నారు.

సమ్మక్కసారలమ్మ గద్దెలు, ఎంట్రెన్స్, క్యూలైన్ల డిజైన్‌లను సిద్ధం చేసి పూజారుల ఆమోదం తీసుకోవాలని సూచించారు. గద్దెల ఏర్పాట్లు ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు వరుసలో ఉండేలా చూడాలన్నారు. గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ఆధారంగా డిజైన్ రూపొం దించాలని సూచించారు. 

ప్రత్యేక కోర్ కమిటీ

మేడారం మాస్టర్ ప్లాన్‌పై కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కోర్ కమిటీ ఏర్పాటు చేస్తా మన్నారు. జాతర పూజారులు, పరిశోధకు లు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కూడి న కోర్ కమిటీ మాస్టర్ ప్లాన్ అమలును పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం సజావుగా, తొందరగా పూర్తి ఆయ్యేలా చూడాలన్నారు. జనవరిలో జరిగే సమ్మక్క జాతర ప్రారంభానికి ముందు మాస్టర్ ప్లాన్‌లోని తొలి దశ పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.