15-10-2025 12:00:00 AM
బూర్గంపాడు, అక్టోబర్14 (విజయక్రాంతి) : బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల్లో కుక్కలు, కోతుల సమస్య వీడని పీడలా తయారైంది. ముఖ్యంగా సారపాక, తాళ్ళగొమ్మూరు, రెడ్డిపాలెం, బూర్గంపాడు, మోరంపల్లి బంజర్, లక్ష్మీపురం అంజనాపురం, పినపాక పట్టి నగర్ తదితర గ్రామాల్లో వీటి సంచారం అధికంగా ఉంది. దీర్ఘ కాలంగా వీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించు కునేవారు కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతు న్నారు.
కుక్కలు వీధి వీధిన సంచరిస్తూ భయపెడుతున్నాయి. చిన్న పిల్లలపైన, సైకిళ్లు, బైక్ లపై వెళుతున్న వారిని వెంబడిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని కొందులు వాపోతున్నారు. పలువురు కుక్కకాట్లకు గురై ఆస్పత్రి లో చికిత్సలు కూడా పొందుతున్నారని అంటున్నారు.ఇక కోతుల విషయానికి వస్తే ప్రతి గ్రామంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.
ఇళ్లపైన, ప్రహరీ గోడలు, చెట్లపైన చెంగుచెంగున గెంతులు వేస్తూ దడపుట్టి స్తున్నాయి. ఇళ్ల వద్ద సామగ్రిని, ఎండలో ఆరబెట్టినబట్లను చిందర వందరచేస్తున్నాయి. ఇళ్ల వద్ద పెంచుకునే మొక్కలతో పాటు పంటలను పాడుచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. పలుచోట్ల చిన్న పిల్లల చేతిలో ఉండే వస్తువులను లాక్కుంటుండడమే కాకుండా దాడి చేస్తున్నాయని అంటున్నారు.
వీటిని నియంత్రించాలంటూ అధికా రులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని చెపుతున్నారు. దీంతో వీటి సంఖ్య మరింత పెరిగి పోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కలు, కోతుల బెడద నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.