25-10-2025 12:00:00 AM
- ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి కోతుల దండయాత్ర
నంగునూరు, అక్టోబర్ 24: కోతుల చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆరబెట్టిన ధాన్యంలో కోతులు సయ్యాటలాడుతూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటిని అక్కడి నుంచి పంపించడానికి రైతులకు తిప్పలు తప్పలేవు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం, పరిసర గ్రామాల్లో కోతుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసిన తర్వాత కూడా కాపాడుకోలేని దుస్థితి రైతులకు ఎదురైంది.
చేనులో పంట సాగు చేసినప్పటి నుంచి, పంట చేతికి వచ్చేసరికి కోతుల దండు దాడి చేస్తోంది. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పలపైకి కోతులు సయ్యాటలాడుతూ గుంపులుగా చేరి ధాన్యాన్ని తింటూ, చిందరవందర చేశాయి. రైతులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా కోతులు వారిపైనే దాడికి దిగుతుండటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నా రు.
పంటను కాపాడుకోవడానికి పడిన కష్టం ఒకవైపు, కోతుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పడుతున్న భయం అన్నదాతలను వేధిస్తున్నాయి. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి కోతుల బెడద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.