7 August, 2026 | 2:06 AM

కేసీఆర్ గారూ.. వాసాలమర్రి పిలుస్తోంది!

07-08-2026 01:24 AM

ఇందిరమ్మ ఇండ్ల దావత్‌కు ఫాంహౌస్ నుంచి వచ్చేందుకు సిద్ధమా? 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్

కూసుమంచి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ‘వాసాలమర్రి దత్తత పేరుతో బిల్డప్ ఇచ్చిన ఫాంహౌస్ దొర.. మీ దత్తత గ్రామం ఇందిరమ్మ ఇండ్ల దావత్‌కు రమ్మని పిలుస్తోంది. ఇండ్లు కట్టించి చేతల్లో చూపిస్తున్న కాంగ్రెస్ పిలుస్తున్నది. ఫామ్ హౌస్ వీడి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా దొర’ అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానించారు. గురువారం కూసు మంచి మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు.

వాసాలమర్రిని దత్తత తీసు కున్నా నంటూ ఆర్భాటపు ప్రచారం చేసుకున్న కేసీఆర్.. మూడేండ్లలో గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఇండ్లు కట్టకుండానే దావత్‌ల పేరుతో ప్రచారం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇండ్ల దావత్‌కు వస్తారా? అని సవాల్ చేశారు. కేసీఆర్ దోస్త్ ఆగవ్వ ఇప్పటికే ఇందిరమ్మ ఇంట్లో ఆనందంగా నివసిస్తుండగా, సగానికి పైగా ఇండ్ల నిర్మా ణం పూర్తయ్యాయని తెలిపారు.

మిగిలిన ఇండ్లు కూడా వివిధ దశల్లో  ఉన్నాయని, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నా రు. వాసాలమర్రికి  జర వచ్చి చూడండి మా అభివృద్ధి’ అంటూ ఎద్దేవా వేశారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, పీఆర్ ఎస్‌ఈ తదితరులు పాల్గొన్నారు.