calender_icon.png 1 July, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన 3 నెలల బియ్యం పంపిణీ

01-07-2025 02:13:57 AM

90 శాతం పూర్తి.. మిగిలిన వారికి లేనట్టేనా...!

మంచిర్యాల, జూన్ 30 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ కార్డు లబ్ధిదారులకు దొడ్డు రకం బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామి ఇచ్చి అమలు చేస్తుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే సారి మూడు నెలల బియ్యం అందజేయాలని ఆదేశాలివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు నెలల ఉచిత బియ్యం పంపిణీని ఈ నెల మొదటి వారం నుంచే ప్రారంభించింది. 

మంచిర్యాల జిల్లాలో మూడు (జూన్, జూలై, ఆగస్టు) నెలలకు సంబంధించి ఒక్కో యూనిట్ కు నెలకు ఆరు కిలోల చొప్పున 18 కిలోల చొప్పున పౌర సరఫరాల శాఖ అధికారులు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలో 90 శాతం పంపిణీ పూర్తి చేశారు. బెల్లంపల్లి మండలంలో 85 శాతం, భీమినిలో 87 శాతం, చెన్నూర్ లో 92, దండేపల్లిలో 85, జైపూర్ లో 89, జన్నారంలో 88, కాసిపేటలో 94, కోటపల్లిలో 88, లక్షెట్టిపేటలో 90, మంచిర్యాలలో 96, మందమర్రిలో 86, తాండూరులో 89, వేమనపల్లిలో 88, నస్పూర్ లో 98, హాజీపూర్‌లో 87, భీమారంలో 88, కన్నెపల్లిలో 87, నెన్నెల మండలంలో 86 శాతం మంది లబ్దిధారులు మూడు నెలల సన్న బియ్యాన్ని పొందారు. జిల్లాలోని 2,23,844 మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులలో 2,00,179 మంది లబ్ధిదారులు రేషన్ తీసుకున్నారు.

సెప్టెంబర్ నెల వరకు రేషన్ లేనట్టే...

కాగా మిగిలిన పది శాతం లబ్ధిదారులకు ఇక లేనట్టే లెక్క. అంటే సుమారు 23,600 మంది కార్డుదారులు రేషన్ కోల్పోయారు. ఇప్పటి వరకు రేషన్ పంపిణీకి సంబంధించి గడువు పెంచుతూ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వివిధ కారణాలతో రేషన్ తీసుకోని లబ్ధిదారులకు నష్టం జరిగినట్టే. ఒక నెలలో నష్టపోతే మరో నెలలో తీసుకునే అవకాశం గతంలో ఉండేది, ప్రస్తుతం మూడు నెలలకు ఒకే సారి అవకాశం కల్పించడంతో రేషన్ తీసుకోని వారు తిరిగి పొందాలంటే సెప్టెంబర్ నెల వరకు ఆగాల్సిందే, ఈ మూడు నెలల బియ్యం నష్టపోయినట్టే.. సంబంధిత అధికారులు ముందు ముందు ఏమైనా అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.