31-08-2025 01:10:16 AM
మన దేశం ఒకప్పుడు సిరిసంపదలతో, ధనధాన్యాలతో, ముత్యపురాశులతో తులతూగుతూ ఉండేది. ఇది గమనించిన అనేక మంది మధ్యయుగంలో మన దేవాలయాలు, సాంస్కృతిక కట్టడాలపై దండెత్తడం మొదలుపెట్టారు. కొంత మంది ధనరాశుల కోసం దండయాత్రలు చేస్తే మరికొంత మంది రాజులు రాజ్య విస్తరణ కోసం దండయాత్రలు చేశారు. కారణమేదైనా కానీ వారి దండయాత్రల ఫలితంగా భారతదేశ సంపద కొల్లగొట్టబడింది.
అంతే కాకుండా సాంస్కృతిక కట్టడాలు ఉనికిని కోల్పోయాయి. మధ్యయుగం నుంచే భారతదేశ సంపదపై అనేక మంది కన్నేశారు. ఇలా దేశ వారసత్వ సంపదపై దాడులు, దండయాత్రలు చేసిన వారిలో ముస్లిం రాజులు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇలా అఫ్ఘనిస్తాన్‌కు చెందిన గజినీ మహ్మద్ అనే పాలకుడు మొదట భారత్‌పై దండయాత్ర చేశాడు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 26 ఏండ్ల కాలంలో మొత్తం 17 సార్లు దాడులు చేశాడు.
‘షికన్’ ఆగయా
గజినీ మహ్మద్‌కు షికన్ అనే బిరుదు ఉండేది. షికన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు అని అర్థం. గజినీ మహ్మద్ తన పాలనాకాలంలో అనేక సార్లు భారత్‌పై దండెత్తి దేవాలయాలను ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా.. సంపదను కూడా కొల్లగొట్టాడు. రాజ్యాన్ని పటిష్టపరుచుకోవడానికి గజినీకి డబ్బు అవసరం అయింది. ఈ డబ్బు కోసమే గజినీ మహ్మద్ భారత్‌పై దాడులు చేసి సంపదను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గజినీ మహ్మద్ దండయాత్రలతో అతడికి షికన్ అనే బిరుదును కూడా ఇచ్చారు. ఈ దండయాత్రల వల్ల మన దేశానికి విదేశాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. విదేశీ వర్తకానికి ఎంతో కొంత ఈ దండయాత్రలు ఉపయోగపడ్డాయి.
థానేశ్వర్ చరిత్ర ఇదే..
భారతదేశంలోని హర్యానాలో గల కురుక్షేత్ర జిల్లాలో ఈ నగరం ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి వాయువ్య దిశలో దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. పుష్యభూతి రాజవంశానికి థానేశ్వర్ రాజధానిగా ఉండేది. పుష్యభూతి చక్రవర్తి ప్రభాకరవర్ధనుడు ఏడవ శతాబ్దంలోనే థానేశ్వర్‌ను పాలించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆ మహారాజు అనంతరం అతని కుమారులు రాజ్యవర్ధన, హర్షలు థానేశ్వర్‌ను పాలించాడు. క్రీ. శ 1014లో గజినీ మహ్మద్ థానేశ్వర్‌పై దాడి చేసి అక్కడి సంపదను కొల్లగొట్టాడు.
గజిబిజి చేసిన గజినీ
అప్పటి వరకు థానేశ్వర్ నగరంతో పాటు అక్కడ ఉన్న ఆలయం సిరి సంపదలతో తులనాడుతూ ఉండేది. ఆ ఆలయంపై ఎప్పుడైతే గజినీ కన్ను పడిందో క్రీ.శ 1014లో దాని పని పెట్టాడు. ఆలయ సంపదను దోచుకోవడం మాత్రమే కాకుండా ఆలయాన్ని కూడా ధ్వంసం చేసినట్టు పలువురు చరిత్రకారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హిందుస్థాన్‌లో థానేశ్వర్ ప్రత్యేక స్థలంగా ఉండేది. అందుకోసమే ముస్లిం పాలకుడు గజినీ కన్ను థానేశ్వర్ మీద పడింది.
ముస్లిం ప్రజలు మక్కాను ఎలా విశ్వసిస్తారో, అలాగే హిందువులు కూడా థానేశ్వర్‌ను విశ్వసిస్తారని గజినీకి తెలియడంతో దాడికి పూనుకున్నాడు. థానేశ్వర్ ఆలయంలో చక్రస్వామి విగ్రహం ప్రధాన విగ్రహంగా ఉండేది. గజినీ సేనలు దండయాత్ర చేసిన కాలంలో అనేక విగ్రహాలను ధ్వంసం చేసి ఈ ప్రధాన విగ్రహాన్ని గజినీకి పంపారు. ఈ విగ్రహాన్ని గజినీ ప్రభువు కసితీరా కాళ్ల కింద వేసి తొక్కుతాడనే ఉద్దేశంతో అప్పటి సేనలు అలా పంపినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం థానేశ్వర్ నగరం ఒక పురాతన దిబ్బపై ఉంది. ఈ దిబ్బ సుమీరు 1 కిలోమీటర్ పొడవు, 750 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. దీన్ని ‘హర్ష్ కా తిలా’ అని పిలుస్తున్నారు. గజినీ సేనలు దాడి చేయడంతో థానేశ్వర్‌ను పాలిస్తున్న పాలకుడు భయపడి పారిపోయాడు.