25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : శనివారం నుంచి వాహనాల షో రూమ్‌ల(డీలర్ల) వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖలో మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయని, కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని తెలిపారు.
ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్‌ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారని, రవాణ శాఖలో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరిందని, దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని స్పష్టం చేశారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందని, రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజ లంతా సహకరించాలని మంత్రికోరారు.