04-08-2025 12:00:00 AM
ఉదయుడు సడీసప్పుడు లేకుండా నా ఇంటి హృదయం లోనికి వచ్చి రెక్కలు విప్పార్చాడు. కంటి రెప్పల దగ్గర వెలుతురు అల్లరి చేశాడు. నిండిన చీకటిని ఊడ్చేశాడు. సూర్యుని స్పర్శతో పిచ్చుకలు రెక్కలు విప్పార్చి గొంతు తలుపులు తెరుస్తూ కిచకిచ ధ్వనులు చేశాయి సాగరం అలలకు బంగారు రంగు పూసుకుంది. చేపలు ఎగిరి దూకుతున్నవి.
కొంచెం పూసుకుందామని నీటి కడుపులో పారుతూ నీటిలోని సూర్యునితో ఆటలాడుకుంటున్నాయి చెట్ల ఆకులు కిరణాలను నోరు తెరిచి చప్పరిస్తూ కడుపు నింపుకుంటున్నాయి నీటి బొట్టును తాగిన విత్తనాలు కిరణాల చేతులు పట్టుకొని పైకి ఎగబాకుతున్నాయి సూర్యుడు పోసిన వెలుతురు పశువుల గిట్టలలో దుమ్ము నింపుతున్నది. అంబా ధ్వనులతో సందడి చేస్తున్నాయి.
రైతు నిద్ర దుప్పటి తీసేసి పచ్చ పచ్చ పైరులకు పురుడు పోస్తందుకు చెల్కకు పోయిండు ఊరి కుల వృత్తులన్నీ మేలుకొని బీదరికాన్ని తెగ నరకడానికి కత్తులు నూరుతున్నాయి. విద్యార్థులందరూ అక్షరాలు చెప్పే మాటలు వినడానికి బడికి పయనం కట్టారు అమ్మ ఇంటి పనులను ముగించుకొని సూర్యునితో ముచ్చటిస్తుంది ఇద్దరం ఒకటే లే అని !