21-09-2025 04:42:05 PM
అనంతగిరి: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ "మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో వేడుకలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవాళ బతుకమ్మ సంబరాల ప్రారంభ వేడుకలు వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, తదితరులు పాల్గొననున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతాయి. ఎన్నడు లేని విధంగా గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా సంబరాలు నిర్వహిస్తామని మన తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. అనంతగిరి మండలంలో ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ సందడి మొదలైంది. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించుకొని మహిళలు సాయంత్రం సాంప్రదాయ పాటలతో ఊరూరా బతుకమ్మకు మహిళలు స్వాగతం పలికారు. వేడుకలు జరిపేందుకు మహిళలు తరలివెళ్లారు. మహిళలందరూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆమె అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మండల ప్రముఖులకు రాజకీయ నాయకులకు ఆడబిడ్డలందరికీ కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి తరఫున మా తరఫున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.