12-01-2026 07:40:29 PM
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): యువత చైతన్యవంతంగా దేశభక్తిని కలిగి ఉండాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. జిహెచ్ఎంసి ఉప్పల్ జోనల్ పరిధి ఘట్ కేసర్ పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద స్వామి విగ్రహాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.
స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలకు వారి జయంతి ఉత్సవాలలో, వర్ధంతి సభలలో కేవలం దండలు వేసి స్వీట్లు పంచే విధంగా కాకుండా విగ్రహాలను చూసినప్పుడల్లా వారు చేసిన గొప్పతనాలను నెమరేసుకోవాలన్నారు. స్వామి వివేకానంద దేశంలోని యువతీ, యువకులకు ఎంతో ఆదర్శప్రాయుడన్నారు.
ఈ దేశ సనాతన ధర్మాలు సంస్కృతిని భగవద్గీత అర్థాలను ప్రపంచ దేశాలకు తన ప్రసంగాల ద్వారా తెలియజేసిన గొప్ప మహ నీయుడు వివేకానందుడని కొనియాడారు. నేడు యువతను డ్రగ్స్ మహమ్మారి పీడిస్తుందని, సెల్ ఫోన్ నే జీవితంలో మారిందని, అమ్మ, నాన్న, స్నేహితులతో మాట్లాడే టైం లేదని, అంతా కంప్యూటర్, సెల్ ఫోనే అయ్యిందని, అందులోనూ మంచిని ఆహ్వానించాలని చెడును దరిచేరనీయవద్దని యువతకు సూచించారు.