01-07-2025 12:44:47 AM
రైతులకు రూ.375 కోట్లు అందజేసినం
బ్యాంకు నూతన అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
భీమదేవరపల్లి, జూన్ 30: ముల్కనూర్ రైతు సహకార సంఘాన్ని ఆసియా ఖండంలోనే ఆదర్శంగా నిలిపామని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం సహకార బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా ప్రవీణ్రెడ్డి, బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా గజ్జి వీరయ్యను పాలకమండల సభ్యులు ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1987లో తాను బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.375 కోట్లు అందించినట్లు తెలిపారు. ఏటా రైతులకు రూ.230 కోట్లు రుణాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కరణలకు ఖర్చు కోసం రూ.౧౦ వేల నగదుతోపాటు ఉచితంగా బియ్యం అందిస్తున్నామని వివరించారు.
రైతుల కోసం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి రైతును మరింత ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. నూతనంగా గెలిచిన డైరెక్టర్లు బ్యాంకు ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య ,గణబోయిన శ్రీనివాస్, గుర్రాల భాస్కర్రెడ్డి, కాశిరెడ్డి వసంత, బొల్లంపల్లి కుమారస్వామితోపాటు రైతులు పాల్గొన్నారు.