calender_icon.png 23 August, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ బరిలో టికెట్ కోసం మురళీగౌడ్ దరఖాస్తు

23-08-2025 01:29:16 AM

- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం సమర్పించిన సీనియర్ నేత

- బలమైన స్థానిక కేడర్ ఉంది 

- అవకాశమిస్తే గెలుపు నాదేనని ధీమా

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 22 (విజయ క్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ రసవత్తరం గా మారుతోంది. పలువురు ఆశావహులు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉండగా, సీనియర్ నాయకుడు, స్థానికుడైన పడమటి మురళీగౌడ్ తన అభ్యర్థిత్వాన్ని బలంగా వినిపించారు. నేను పక్కా లోకల్ అంటూ, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు శుక్రవారం దరఖాస్తు సమర్పించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు బలమైన కేడర్ ఉందని, ప్రజలతో దశాబ్దాల అనుబంధం ఉందని మురళీగౌడ్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి టికెట్ కేటాయిస్తే, విజయం సాధించి పార్టీకి కానుకగా ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీకి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన అనుభవం తనకు కలిసి వ స్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గంతో విడదీయరాని బంధం తన దరఖాస్తుతో పాటు, నియోజకవర్గంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని మురళీగౌడ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. స్థానికత, రాజకీయ అనుభవం, బలమైన కేడర్ వంటి అంశాలు తనకు అనుకూలంగా ఉన్నాయని మురళీగౌడ్ వర్గం భావిస్తోంది. అయితే, ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.