28-11-2025 12:00:00 AM
గద్వాల, నవంబర్ 27 : గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ బోయ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4కార్లు, 1-బొలేరో, 2బైక్ లు, 11 మొబైల్, 13 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారంగా ..కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన కుర్వ వీరన్నకు రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బోయ చిన్న భీమరాయుడు మిల్లు వీరన్నను రాజకీయంగా, భూమి పంచాయతులు, రైస్ మిల్లు పై కేసులు పెట్టించి తన వ్యాపారానికి అడ్డు తగులతుండటంతో ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో మరికొందరితో చర్చించి వ్యూహం పన్నారు.
ఈ క్రమంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఈశ్వరయ్య గౌడ్ ను సంప్రదించగా రూ.25లక్షలకు డీల్ కుదిరింది. ఇందులో భాగంగా రూ.15 లక్షలు ముందస్తుగా తీసుకున్నారు. గత కొంత కాలంగా చిన్న భీమ రాయుడు కదలికలపై నిఘా పెట్టారు. ఈనెల 21న నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు సొంత పనుల కోసం గద్వాలకు రాగ పనులు ముగించుకుని నందిన్నెకు భైక్ పై వెళ్తున్న క్రమంలో సుఫారీ గ్యాంగ్ ధరూర్ మండలం జాంపల్లి వద్ద మృతుని బైక్ ను బొలేరో వాహనం ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో చిన్న భీమరాయుడు సంఘటన స్థలంలో మృతి చెందాడు.
మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. మృతునికి అప్పటికే ప్రాణహానీ ఉందని, తెలిసిన వారే హత్య చేయించారని మృతుని అన్న పెద్ద భీమరాయుడు ఫిర్యాదు మేరకు ధరూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య పర్యవేక్షణలో గద్వాల సీఐ టి.శ్రీను ఆధ్వర్యంలో ధరూర్ ఎస్‌ఐ శ్రీహరి, గద్వాల రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్, గట్టు ఎస్‌ఐ కే.టి మల్లేష్,తదితరలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సుఫారీ గ్యాంగ్ లోని కీలక నిందితులను అదుపులో తీసుకుని విచారించారు.
ఇందులో భాగంగా ప్రధాన నిందితులు నందిన్నెకు చెందిన మిల్లు యజమాని వీరన్న, అతని కుమారుడు కుర్వ సురేందర్ హైదరబాద్ లో ఓ లాడ్జీలో పట్టుకోగ, హత్య కేసులో అనుమానిస్తున్న బోయ వీరన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ హత్య తామే చేయించామని వివరాలు వెల్లడించారు. హత్య కేసులో మిల్లు వీరన్న, కుర్వ సురేందర్, బోయ వీరన్న తెలుగు మధు బాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరీ సుంకన్న, బైరీ కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజేశ్ అరెస్టు చేసి రిమాండ్ తరలించగా కర్నూల్ జిల్లాకు చెందిన ఈశ్వర్య గౌడ్ పరారిలో ఉన్నట్లు త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
హత్య కేసును చేధించిన ఎస్‌ఐలను, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో గద్వాల ఎఎస్పీ శంకర్, డీఎస్పీ వై.మొగులయ్య, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.