26-11-2025 08:26:20 PM
తరచూ తప్పతాగి తన్నుతున్నాడని, దిండుతో హతమార్చిన భార్య
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ కుమార్ కు మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రత్నవత్ తుకారాం బాలాజీనగర్ తండా నివాసి, 16 ఏళ్ల క్రితం మీనా అనే మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా సమస్యలు, అనుమానాలు కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ విషయంపై పూర్వం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు పేర్కొన్నారు. 25న రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులు నిద్రలోకి వెళ్లగా, 26న తెల్లవారు జామున 03.00 గంటలకు తుకారాం భార్య మీనా ఫిర్యాదుదారుని ఇంటికి వచ్చి తుకారాం నిద్రలేవడం లేదని తెలిపింది.
ఫిర్యాదుదారు అక్కడికి వెళ్లి చూడగా తుకారాం అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. అతను ప్రశ్నించగా, మృతుడి భార్య మీనా తన భర్త నిరంతరం అనుమానించి వేధిస్తుండటంతో, అతన్ని ఏదో విధంగా తొలగించాలని భావించి, మంగళవారం రాత్రి దిండుతో శ్వాస ఆడనివ్వకుండా చేసి హత్య చేసినట్లు అంగీకరించింది. హత్య ఘటన పట్ల ఎల్లారెడ్డి ఎస్సై కేసు నమోదు చేసుకుని ఫిర్యాదుపై యల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపి, నిందితురాలు మీనాను అదుపులోకి తీసుకొని, పూర్తి విచారణ చేపట్టనున్నట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.