calender_icon.png 12 December, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పని చేయాలి

10-12-2025 02:51:28 AM

  1. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
  2. ఓటు చోరీ సంతకాల సేకరణను వేగవంతం చేయాలి 
  3.   14న ఢిల్లీలో మహాధర్నాకు సన్నద్ధం కావాలి
  4. డీసీసీ కొత్త అధ్యక్షులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచనలు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లాలోని సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకుని సమన్వయంతో పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. రాష్ర్టంలో జరుగుతున్న ‘ఓట్ చోరీ’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న ‘ఓట్ చోర్ మహా ధర్నా’ విజయవంతం అయ్యేలా సన్నద్ధం కావాలని చెప్పారు.

మంగళవారం డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలు, ప్రంటల్ ఆర్గనైజేషన్  చైర్మన్లతో మహేశ్‌కుమార్‌గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన ఆరు నెలల పనితీరు డెడ్‌లైన్‌ను కొత్త డీసీసీ అధ్యక్షులు గుర్తుంచుకోవాలని, ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని గుర్తు చేశారు. 

ఆదరణను తట్టుకోలేకే మోదీ విమర్శలు 

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

దేశంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర సమరంలో పోరాడి, దేశానికి ప్రధానిగా పనిచేసిన నెహ్రుపై కూడా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. జిన్నా ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతంలో కొన్ని పంక్తులు మార్చివేశాడని చెప్పడం చరిత్రను వక్రీకరించడమే అవుతుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్  విగ్రహం పెట్టి బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మతవాదాన్ని ముందుపెట్టి రాజకీయం చేయవద్దని బీజేపీకి ఆయన హితవు పలికారు. బీజేపీ పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో కుదేలైందని, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు అదానీ, అంబానీ చేతుల్లో పెట్టారని కోదందరెడ్డి ఆరోపించారు. నెహ్రు, ఇందిరా, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సవరణలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు.