10-12-2025 02:51:05 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ర్ట ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో అడుగులు వేస్తోం ది. విలీనం తర్వాత గ్రేటర్ పరిధిలో వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం తదు పరి కార్యాచరణను వేగవంతం చేసింది. వా ర్డుల పునర్విభజన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
అభ్యంతరాల స్వీకరణ ఇలా..
వార్డుల సరిహద్దులు, విభజనపై ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ జేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసుతో పాటు అన్ని జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో విలీనమైన కొత్త సర్కిళ్లతో కలిపి దరఖాస్తులు స్వీకరిస్తారు. కేవలం మాన్యువల్ గా, లిఖితపూర్వకంగా ఇచ్చిన వినతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, సలహాను పెండింగ్‌లో పెట్టకుండా ఏ రోజు కు ఆరోజే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
10 జోన్లు.. 300 వార్డులు
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గత 10 రోజులుగా చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఉన్న 6 జోన్ల సంఖ్యను 10 జోన్లకు పెంచారు. ఒక్కో జోన్ పరిధిలోకి 30 వార్డులు వచ్చేలా సమానంగా విభజించారు. ఒక వార్డు పరిధి రెండు సర్కిళ్లలోకి గానీ, వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి గానీ వెళ్లకుండా పక్కాగా సరిహద్దులు గీశారు.
వార్డుల డ్రాఫ్ట్‌పై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన వెంటనే దీనిపై లోతుగా చర్చించేందుకు మరో 10 రోజుల్లోపు జీహెఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహిం చాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మేయర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కౌన్సిల్ ఆమోదం లభించిన వెంటనే ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.
ముందస్తు ఎన్నికల కోసమేనా?
ప్రభుత్వ హడావుడి చూస్తుంటే పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వచ్చిన సానుకూల ఫలితం, విలీన ప్రాంతాల్లో కాంగ్రెస్ క్యాడర్ బలం పెరగడం వంటి అంశాలు అధికార పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు పూర్తి కాగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.