15-12-2025 12:00:00 AM
1707 ఓట్ల మెజారిటీతో గెలుపు
అయిజ, డిసెంబర్ 14 : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టి మహేశ్వరమ్మ సర్పంచ్ గా గెలుపొందారు. అయిజ మండలానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి ఒక వ్యక్తి దాదాపు పది సంవత్సరాల నుండి గుంతలు పడిన రోడ్డును ఇరువైపులా మట్టి పూడుస్తూ వచ్చాడు. అతడు రోజు వేకువజామున లేవడం పశువులకు గడ్డి కోసుకు రావడం, ఉదయం తొమ్మిది గంటలకు పారా, గంప తన బైక్ పై పెట్టుకుని తన గ్రామం నుండి రోడ్డుకి ఇరువైపులా గుంతలు పూడుస్తూ 12 గంటల వరకు గుంతలకు వేస్తూ, తర్వాత నాలుగు గంటల వరకు ఆఫీసుల్లో తన పని చూసుకుంటూ, సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు పశువుల మేతకై వెళ్లేవాడు.
ఇదే అతని దిన చర్యగా మారింది. అలా అతను రోడ్లు పూడుస్తున్న విధానం చూసిన చాలామంది అతను చేస్తున్న పనిని చూసి నవ్వుకున్నారు. హేళన చేశారు. కానీ అతను మాత్రం మొక్కవోని ధైర్యంతో తనకు బీహార్ లోని కొండగుట్టను తవ్వి రెండు కిలోమీటర్లు రోడ్డు వేసిన దశరథ లాల్ మాంజి తనకు ఆదర్శమంటూ, తన పనిలో తాను మునిగిపోయేవాడు. ఇలాగే గత పది సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చింది. అతడే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి చిన్నతాండ్రపాడు గ్రామస్తుడు సుధాకర్ గౌడ్, (మాజీ టిడిపి నాయకులు).
అంతేకాదు సర్పంచ్ పదవికి నాలుగు సార్లు పోటీ చేసి గెలుపు అంచుల వరకు వెళ్లి ఓడిపోయాడు. రెండవ విడత ఎన్నికలో తన భార్య ను సర్పంచ్ బరిలో ఉండగా గ్రామ ప్రజలు అందరు తనను అత్యధిక మెజారిటీతో 1707 ఓట్లతో గెలిపించారు. ఈ సందర్బంగా మహేశ్వరమ్మ మాట్లాడుతూ మా ఆయన పట్టుదలతో సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏనాడు నిరాశ చెందక, తను నమ్ముకున్న గ్రామ ప్రజలు, నాకు ఏ రోజైనా న్యాయం చేస్తారంటూ నమ్మకంతో ఉండేవాడు.
ఆ నమ్మకం ఈరోజు చత్తిస్గడ్ ఇన్చార్జి సంపత్ కుమార్ రూపంలో మరియు గ్రామస్తుల పట్టుదల ఏకమై ఈరోజు మమ్ములను దీవించాయన్నారు . ఎన్నో రోజులుగా ఎంతోమంది సర్పంచులను, నాయకులు చూశాము కానీ నిస్వార్ధంగా పనిచేసిన సుధాకర్ గౌడ్ భార్యను ఈసారి తప్పకుండా సర్పంచ్ గా గెలిపించాలని పట్టుదలతో గ్రామస్తులు అంత ఏకమై ఓట్లు వేసి నన్ను గెలిపించారంటూ కన్నీరు కార్చిన మహేశ్వరమ్మ. గ్రామస్తులు రుణం తీర్చుకోవడానికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని గ్రామ సేవకి అంకితం చేస్తామని సంపత్ కుమార్ కి నమ్మినబంటుగా,గ్రామస్తులకు సేవకుడిగా ఉంటానంటూ సుధాకర్ గౌడ్ అన్నారు.