నాచారం వెస్లీ స్కూల్ రోడ్డు కబ్జా..
స్కూల్ కు దారి చూపాలంటూ పూర్వ విద్యార్థుల ఆందోళన..
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో వెస్లీ స్కూల్ లోకి వెళ్లే రహదారిని కబ్జా చేశారంటూ వెస్లీ స్కూల్ పూర్వ విద్యార్థులు నాచారం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. స్కూలుకు పక్కన బహుళ అంతస్తు నిర్మాణం చేపడుతున్న నిర్వాహకులు స్కూలు రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని వారు ఆరోపించారు. పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తపరిచారు. కబ్జా విషయంపై అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ వారు ఆరోపించారు.
పేద మధ్యతరగతి విద్యార్థులు వెస్లీ స్కూల్లో చదువుకుంటున్నారని అలాంటి స్కూలుకు వెళ్లే రహదారిని కబ్జా చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు అధికారులు కుమ్మకై నిర్మాణాలు చేపడుతున్న వారికి వతాస్తు పలుకుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తపరిచారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి స్కూలుకు వెళ్లే రహదారిని ఏర్పాటు చేయాలని వాళ్ళ డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.






