30-07-2025 12:00:00 AM
పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న మహిళలు
జగిత్యాల అర్బన్, జులై 29 (విజయక్రాంతి): నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయికల్ మండలంలోని ప్రముఖ దేవాలయం కొత్తపేట నాగాలయం, జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం, ధర్మశాల శివాలయం, మోతే శివారులోని మహంకాళి దేవాలయం, శక్తి గణపతి దేవాలయం, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయ ఆవరణలోని పాముల పుట్ట వద్ద ఉదయం నుంచే మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్ లో నిల్చొని ఆలయంలోని నాగదేవతల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పుట్టలో పాలు పోసి ప్యాలాలు, పండ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కులు తీర్చుకునేందుకు పుట్టల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ సందర్భంగా దేవాలయాల నిర్వాహకులు పుట్టలో పాలు పోసేందుకు వీలుగా ప్రత్యేకఏర్పాటుచేశారు.