7 August, 2026 | 12:51 AM

పేరుకే ఎమ్మెల్యేలు..!

07-08-2026 12:00 AM
  1. అధికారం వారిది... ఆధిపత్యం వీరిది 
  2. పెత్తనమంతా  పీఏలదే 
  3. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాడో ఎమ్మెల్యేల హవా 
  4. నియోజకవర్గాల్లో జోరుగా భూ దందాలు, సెటిల్మెంట్లు 
  5. రేట్లు కట్టి మరీ అధికారుల పోస్టింగులు
  6. ‘డీలిమిటేషన్’ భయంతో సంపాదనపై దృష్టి 

ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించింది ప్రజలు... రాజ్యాంగబద్ధంగా అధికారం చేపట్టింది ఎమ్మెల్యేలు. కానీ, తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది! ప్రజాప్రతినిధులు ’పేరుకే’ పరి పరిపాలన సాగిస్తుంటే... తెరవెనుక అసలు సిసలు ’పాలకులు’గా వారి పర్సనల్ అసిస్టెంట్లు (పీఏలు), అనుచరులే చెలరేగిపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయంలో ’షాడో’ ఎమ్మెల్యేల హవా శృతిమించుతోంది.

భూ దందాలు, సెటిల్మెంట్లు, బదిలీల బేరసారాల నుంచి వైద్య ఖర్చులో నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే ఎల్వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల  కమిషన్ల వసూళ్ల వరకు అంతా తామై నడిపిస్తున్నారు. రేపటి ’డీలిమిటేషన్’ భయంతో పదవి ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలన్న ధ్యేయంతో సాగుతున్న ఈ అక్రమాలపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..

రంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలో రాజకీయం కొత్త రంగు పులుముకుంది. గెలిచిన ఎమ్మెల్యేలు పేరుకే పరి పరిపాలన చూస్తుండగా... తెరవెనుక అంతా వారి పర్సనల్ అసిస్టెంట్లు (పీఏలు), బంధువులు, ముఖ్య అనుచరులే నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ’దో చుకో.. దాచుకో.. దండుకో’ అన్న చందంగా తయారైంది నియోజకవర్గాల పరిస్థితి. మం త్రుల పర్యవేక్షణా లోపం, ఎమ్మెల్యేల ఉదాసీనత కలసి కొందరి పీఏలకు వరంగా మారగా, సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

రియల్ వ్యాపారం పైనే దృష్టి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌అర్), గ్రీన్ ఫీల్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలతో ఉమ్మడి రంగారె డ్డి జిల్లాలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూసేకరణ ప్రక్రియ వేగవం తం కావడం, కార్పొరేట్ సంస్థల రాకతో దం దాలు మరింత శ్రుతిమించాయి. దీంతో వా రంతా ‘రియల్’ పైనే ఫోకస్ పెట్టారు

సెటిల్మెంట్లకు ప్రత్యేక  ఆఫీసులు..

సరిహద్దు వివాదాలున్న భూములు, ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ పీఏలు, షాడో నాయకులు పంచాయతీలు’నిర్వహిస్తున్నారు. ఇసుక, మైనింగ్, చెరువుల్లో బంకమట్టి తరలింపు నుంచి గ్రానైట్ క్వారీల వరకు ప్రతిచోటా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది ఈ ’షాడో’ ముఠాయే.

పోస్టింగ్‌కు రేటు ఫిక్స్.. బదిలీల బేరాలు..

ప్రజాసేవ పక్కనబెట్టి, సర్కారీ అధికారుల బదిలీలను వ్యాపారంగా మార్చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నియోజకవర్గ పరిధిలో కీలక శాఖల అధికారుల నియామకం పీఏల చేతుల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం.

పోస్టింగ్ ప్యాకేజీలు:

పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్, ఎంపీడీవో, హెల్త్ డిపార్ట్మెంట్లలో ప్రాధాన్యత ఉన్న స్థానాల కోసం 10 లక్షల నుండి 50 లక్షల పైనే వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. నెలవారీ ’మామూళ్లు’... ప్రశ్నిస్తే కేసులు పెట్టి మరి వేధింపులు.శివారు ప్రాంతాల్లో నిర్మించే విల్లా ప్రాజెక్టులు, బార్లు,విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ బిల్లుల్లో కచ్చితమైన శాతాలు (కమిషన్లు) పీఏల ఖాతాల్లోకి చేరాల్సిందే. ముఖ్యంగా విల్లాలు ప్రాజెక్టుల నిర్వాహకులతో భారీ బేరాలు కుదుర్చుకుంటున్నారు. 

ఒకవేళ  విల్లా యజమానులు తమ దారికి రాకపోవడంతో విల్లా ప్రాజెక్టులకు నిబంధనల కొర్రీలు పెట్టి అధికారులను ఉసిగొలిపి  ప్రాజెక్టు పనులను నిలిపి వేస్తున్నారు. శివారు ప్రాంత్రం లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఒక విల్లా ప్రాజెక్టు సదరు ఎమ్మెల్యేకు.... అమ్యామ్యాలా బేరం కుదరకపోవడంతో  ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ అక్రమాలను నిలదీసినా లేదా సోషల్ మీడియా వేదికగా నిలదీసే ప్రయత్నం చేసినా... స్థానిక పోలీసుల ద్వారా కేసులు పెట్టి మరి బెదిరింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాల వారీగా పరిస్థితి పరిశీలిస్తే..

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాను పరిశీలిస్తే ఐటీ, ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలతో విపరీతంగా ఈ ప్రాంతం లో పెరిగిన భూముల ధరలు. భూ దందాలు, హైరైజ్ బిల్డింగ్స్ నుంచి నెలవారీ మామూళ్ల వసూళ్లు ప్రధాన అజెండాగా మారిందనే బహిరంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మేడ్చల్- మల్కాజ్గిరి  పారిశ్రామిక, మున్సిపల్ ప్రాంతాలు కావడం వల్ల కాంట్రాక్టర్ల కమిషన్లు, నియోజకవర్గాల్లో పీఏలు సైతం నామినేటెడ్ పదవులను డిసైడ్ చేసే స్థాయిలో ఆధిపత్యం. వికారాబాద్ లో మైనింగ్, ఇసుక, మట్టి అక్రమ రవాణా విపరీతం. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల బినామీలు గిరిజన, వ్యవసాయ భూములపై కన్నువేసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

‘డీలిమిటేషన్’ గుబులు..

రాబోయే రోజుల్లో పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ జరిగితే నియోజకవర్గాల సరిహద్దులు మారుతాయి. ప్రస్తుతం తాము గెలిచిన స్థానాలు ఉంటాయో ఊడతాయో, మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో లేదోనన్న అభద్రతా భావం చాలామంది ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో కనిపిస్తోంది. పదవి ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత ఆర్థికంగా స్థిరపడాలనే ఆలోచనతోనే ఈ స్థాయిలో అక్రమాలకు తెగబడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలు తమ సొంత పీఏలు, అనుచరుల చేతివాటాన్ని, అవినీతి దందాలను అరికట్టకపోతే... భవిష్యత్తు రాజకీయాల్లో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో అధిష్ఠానం మరియు జిల్లా పర్యవేక్షకులు తక్షణమే జోక్యం చేసుకోకపోతే ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.