calender_icon.png 31 December, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ నాటికి నల్లగొండ ఎక్స్‌రోడ్స్ కారిడార్

31-12-2025 12:00:00 AM

  1. రూ. 620 కోట్లతో భారీ ఫ్లుఓవర్
  2. సర్వీస్ రోడ్ల కోసం భూసేకరణ పూర్తి చేయాలి 
  3. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్‌పేట్, డిసెంబర్ 30 (విజయక్రాంతి):దక్షిణ హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నల్లగొండ ఎక్స్‌రోడ్స్ ,ఒవైసీ జంక్షన్.. కారిడార్ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఆయన ఈ కారిడా ర్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నల్లగొండ ఎక్స్‌రోడ్స్ నుంచి సైదా బాద్, ఐఎస్ సదన్ మీదుగా ఒవైసీ జంక్షన్ వరకు సాగే ఈ కాన్‌ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ ట్రాఫిక్ అంతరాయం లేని మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు కమిషనర్‌కు వివరించారు. రూ. 620 కోట్ల అంచనా వ్యయంతో, ఈపీసీ పద్ధతిలో నిర్మిస్తున్న 2,530 మీటర్ల 2.5 కి.మీ పొడవైన ఈ భారీ ఫ్లుఓవర్ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పనుల పరిశీలన సందర్భంగా కమిషనర్ కర్ణన్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు.

పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు, అత్యంత కీలకమైన సైదాబాద్ నుంచి ధోబీఘాట్ జంక్షన్ వరకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు అనుమతులను పోలీ సుల నుంచి వెంటనే పొందాలని సూచించారు.ఫ్లుఓవర్ ప్రారంభమయ్యే నాటికి కింద ట్రాఫిక్ సాఫీగా సాగేలా సర్వీస్ రోడ్లను కూడా సిద్ధం చేయాలన్నారు.

సర్వీస్ రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ బి.గోపాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.