22-08-2025 06:39:21 PM
గో బ్యాక్ మార్వాడి ర్యాలీని అడ్డుకున్న నల్గొండ పోలీసులు
అక్రమ అరెస్టులతో గో బ్యాక్ మార్వాడి ఉద్యమాలను ఆపలేరు.
హోల్సేల్ వ్యాపారం చేసేవారికి ఆహ్వానిస్తాం
నల్లగొండటౌన్,(విజయక్రాంతి): ఓయూ జేఏసీ పిలుపుమేరకు మార్వాడి అరాచకాలకు విరుద్ధంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్థానిక వ్యాపారస్తులు తమ షాపులను బందు చేసి నిరసన వ్యక్తపరిచారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వందల మందితో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే పోలీసులకు సమాచారంతో రంగంలో దిగిన నలగొండ టూ టౌన్ ఎస్సై వై సైదులు ర్యాలీని అడ్డుకున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరంగా విరుద్ధమని వెంటనే ర్యాలీను ఆపాల్సిందిగా హెచ్చరించారు.
స్థానిక వ్యాపారస్తులు ససేమిరా అనటంతో ర్యాలీని కొనసాగించే క్రమంలో పోలీసులకు స్థానిక వ్యాపారస్తులకు తీవ్రవాగ్వాదం ఏర్పడింది. టూ టౌన్ పోలీసులు స్థానిక వ్యాపారస్తులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక మొబైల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం రాజులు చేసే అరాచకాలకు విరుద్ధంగా పోరాటాలు చేసిన ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ గడ్డ అని ఇదే గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటాలు చేసిన మాకు అరెస్టులు కొత్తేమి కాదని తెలిపారు.
అక్రమ అరెస్టులతో గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఆపలేరని, తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందే నని హోల్సేల్ వ్యాపారాలు చేసే మార్వాడీలకు తెలంగాణలో స్వాగతిస్తామని, స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొట్టడానికి వచ్చిన రిటైలర్ వ్యాపారులను తరిమి తరిమి కొడతాం తస్మాత్ జాగ్రత్త.! అంటూ హెచ్చరించారు. అదేవిధంగా గతంలో మామా మామా..! అనుకుంటు తెలంగాణకు వలస వచ్చిన మార్వాడిలు ఈరోజు మా నెత్తిన తాండవం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మమ్ములను అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
మా బాధలు మా గోసలు మీ కంటికి కనబడటం లేదా..? తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మార్వాడీల అరాచకాలను నియంత్రణ చేయాలని తెలిపారు. మా బతుకులను మార్చండి.. ఎందరో వ్యాపారస్తులు మార్వాడీల అరాచకాలకు తట్టుకోలేక చిరు వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఇవి మీకు కనిపించడం లేదా..మీరు నియంత్రణ చేయకుంటే.. మేము గో బ్యాక్ మార్వాడి నినాదాన్ని ఉదృతం చేయక తప్పదు అంటూ హెచ్చరిక చేశారు.