22-08-2025 09:02:56 PM
చిట్యాల, వెంకట్రావుపల్లి(సీ), జడలపేట, దూత్ పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, అందుకోసమే పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంతో పాటు, వెంకట్రావుపల్లి(సీ) గ్రామంలో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, రూ.40 లక్షలతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులు, రూ.3 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
అలాగే జడలపేట గ్రామంలో రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, దూత్ పల్లి గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతీ ఇంటికి మౌలిక వసతులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గ్రామాలను నిర్వీర్యం చేసిందని, గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపించడంతో చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.