25-10-2025 12:00:00 AM
ఏసీసీ ఆఫీస్ నుంచి తరలింపు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మోసిన్ నఖ్వీ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. ఆసియాకప్ గెలిచిన తర్వాత భారత్ అతనిచేతుల మీదుగా ట్రోఫీ ని తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ట్రోఫీ తీసుకుని వెళ్ళిపోయిన నఖ్వీ దానిని ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో ఉంచాడు. తాను చెప్పేవరకూ ఎవరికీ ఇవ్వొద్దంటూ హుకుం జారీ చేశాడు. అతని తీరుపై మండిపడ్డ బీసీసీఐ ఏసీసీకి ఫిర్యాదు చేయడం, చివరిసారి వార్నింగ్ కూడా ఇవ్వడం వంటి పరిణామా లు చోటు చేసుకున్నాయి. ఐసీసీకి ఫిర్యాదు చేయకముందే భారత్‌కు ట్రోఫీ పంపాలని బీసీసీఐ నఖ్వీకి ఈమెయిల్ చేసింది.
అయితే నఖ్వీ మాత్రం ఇంకా ఓవరాక్షన్ చేస్తూనే ఉన్నాడు. ట్రోఫీని తానే స్వయంగా అందజేస్తానని, భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ లేక బీసీసీఐ ప్రతినిధి వచ్చి తీసుకోవాలం టూ కండీషన్లు పెట్టాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయబోతోంది. ఈ వివాదం కొనసాగుతుండగా నే నఖ్వీ ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ కార్యాలయం నుంచి తరలించినట్టు సమాచారం.
బీసీసీఐ అధికారి ఒకరు ఏసీసీ హెడ్ క్వార్టర్స్ లో ట్రోఫీ లేదని తెలుసుకుని ఆరా తీయగా నఖ్వీ వేరే చోటుకు తీసుకెళ్ళినట్టు చెబుతున్నారు. తాజా పరిణామాలతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రతినిధిగా ఉంటూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారని న ఖ్వీపై మండిపడింది. మరి ఐసీసీకి ఫిర్యాదు చేయకముందే నఖ్వీ భారత్‌కు ట్రోఫీని పంపిస్తాడా లేదా అనేది చూడాలి.