calender_icon.png 24 October, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటం సరిపోలేదు

24-10-2025 01:06:34 AM

రెండో వన్డేలోనూ భారత్ ఓటమి

-ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

-కెప్టెన్‌గా గిల్‌కు తొలి సిరీస్ ఓటమి

అడిలైడ్, అక్టోబర్ 23 : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు పరాజయాల పరంపర కొమసాగుతోంది. పెర్త్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా అడిలైడ్‌లో పోరాడినప్పటకీ ఓటమి తప్పలేదు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించగా.. కోహ్లీ ఫెయిలయ్యాడు. బౌలర్లు మంచి ప్రదర్శనే ఇచ్చినప్పటకీ ఆ పోరాటం సరిపోలేదు. ఫలితంగా యువ సారథి గిల్ కెప్టెన్‌గా తొలి సిరీ స్ ఓటమిని చవిచూశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. కుల్దీప్‌కు చోటు దక్కుతుందని భావించినా గత మ్యాచ్ కాంబినే షన్‌నే భారత్ కొనసాగించింది. తొలి వన్డే తరహాలోనే టీమిండియాకు ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు సరైన ఆరంభాన్నివ్వ లేకపోయారు. గిల్(9) రన్స్‌కే ఔటవగా.. విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. తన కెరీర్‌లో వరుసగా డకౌటవడం కోహ్లీకి ఇదే తొలిసారి. అయితే రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు.

ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 3వ వికెట్‌కు 118 రన్స్ జోడించారు. ఈ క్రమంలో రోహి త్ వన్డేల్లో 59వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా అర్థసెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఔటవడం.. రాహుల్ (11), నితీశ్ రెడ్డి(8) నిరాశపరచడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యే లా కనిపించింది. అక్షర్ పటేల్ 44 రన్స్‌తో రాణించినా చివర్లో చాలా ఓవర్లుండగానే వెనుదిరిగాడు. ఈ దశలో హర్షిత్ రాణా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్షదీప్‌తో కలిసి 37 పరుగులు జోడించాడు. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో 264/9 స్కోర్ చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4/60, బార్ట్‌లెట్ 3/39, స్టార్క్ 2/62 రాణించారు.

ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా త్వరగానే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. మార్ష్ (11). హెడ్ (28) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయి తే మాథ్యూ షార్ట్, రెన్షా ఆసీస్‌ను ఆదుకున్నా రు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 రన్స్ జోడించగా..రెన్షా 30 రన్స్‌కు ఔటయ్యాడు. తర్వాత అలెక్స్ క్యారీ (9) విఫలమైనా.. కూపర్ కన్నోలీ 

అదరగొట్టాడు. షార్ట్ తో కలిసి మెరు పు బ్యాటింగ్ చేశా డు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో భారత బౌల ర్లు వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. పైగా కూపర్ కన్నోలీ క్రీజులో ఉండడం ఆసీస్ విజయాన్ని ఖాయం చేసింది. కన్నోలీ 61(53 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా 46.1ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2 కైవ సం చేసుకుంది. ఆడమ్ జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. సిరీస్‌లో చివరి వన్డే శనివారం సిడ్నీలో జరుగుతుంది.

కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ :

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అడిలైడ్ వన్డేలో స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. రిటైర్మెంట్ వార్తలు విని పిస్తున్న వేళ కోహ్లీ అడిలైడ్‌లో ఆడడం ఇదే చివరిసారిగా భావించిన అభిమానులు అతను డకౌటైనా పెవిలియన్‌కు వెళ్ళేటప్పుడు లేచి నిలబడి సెండాఫ్ ఇచ్చారు. దీనికి కోహ్లీ కూడా స్పందిస్తూ చేతి గ్లౌజులు తీసి వారికి అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. అడిలైడ్‌లో మంచి రికార్డున్న విరాట్ ఇలా డకౌటవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

స్కోర్లు :

భారత్ ఇన్నింగ్స్ : 264/9 

(రోహిత్ శర్మ 73,శ్రేయాస్ అయ్యర్ 61, అక్షర్ పటేల్ 44 ; ఆడమ్ జంపా 4/60, బార్ట్‌లెట్ 3/39, స్టార్క్ 2/62 )

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 265/8 (46.2 ఓవర్లు)( షార్ట్ 74, కూపర్ కన్నోలీ 61 నాటౌట్, మిఛెల్ ఓవెన్ 36; వాషింగ్టన్ సుందర్ 2/37, అర్షదీప్ 2/41, హర్షిత్ రాణా 2/59)