21-03-2025 12:00:00 AM
గత అయిదు దశాబ్దాలుగా దేశంలో అతి పెద్ద శాంతిభద్రత సమస్యగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా? అవుననే అనిపిస్తోంది. 2026 మార్చి నాటికి ‘మావోయిస్టు రహిత భారత్’గా దేశాన్ని మారుస్తామని గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ ఉద్దేశంతో ప్రకటించారో తెలియదు కానీ అప్పటినుంచి మావోయిస్టులకు స్థావరంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోస్టులను ఏరివేస్తున్నారు.
తాజాగా గురువారం ఒకే రోజు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాం కేర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయినట్లు చెబుతున్నారు. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మావోస్టుల ఏరివేత ఉధృతమైంది.
ఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి 22 నాటికి 344 మంది మావోస్టులు మృతి చెందగా ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 283 మంది చనిపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చోటు చేసుకున్న అతిపెద్ద ఘటనల్లో తాజా ఎన్‌కౌంటర్ రెండోది. గత ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందా రు. ఈ ఏడాది మూడు నెలల్లోనే దాదాపు 90 మంది నక్సల్స్ మృతి చెం దినట్లు అంచనా.
వీరిలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. 2026 మార్చి చివరినాటికల్లా దేశాన్ని ‘మావోయిస్టు రహిత భా రత్’గా మారుస్తామని అమిత్ షా ప్రకటించడం వెనుక పక్కా ప్రణాళిక ఉ న్నట్లు కనిపిస్తోంది. గత దశాబ్దకాలంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మావోయిస్టు ఉద్యమం గణనీయంగా బలహీనమయినట్లు అమిత్ షా చెబుతున్నారు.
గత ఏడాది కాలంగా బస్తర్‌లో మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పౌరులు, భద్రతా జవాన్ల మర ణాలు అతి తక్కువగా ఉన్న మాట వాస్తవమే. అదే సమయంలో పెద్ద సం ఖ్యలో మావోయిస్టు కేడర్, నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అయినా ఇంకా కొందరు మాత్రం లొంగి పోవడానికి ఇష్టపడడం లేదని, వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని అమిత్ షా అనేక సందర్భాల్లో హెచ్చరించారు.
ఒకప్పుడు భద్రతా దళాలు అడుగు పెట్టడానికి భయపడే బస్తర్ ప్రాం తంలో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకోవడానికి కారణాలేమిటి? ప్రభుత్వం అనుసరిస్తున్న మూడంచెల వ్యూహమే దీనికి ప్రధాన కారణం.
మావోయిస్టుల హింసను అదుపు చేయడానికి కౌంటర్ టెర్రరి జం దళాల ఆపరేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు స్థానిక ప్రజలను మావోయిస్టునుంచి దూరం చేయడానికి ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తు న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం, లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పించడం ద్వారా వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకు రావడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశాలు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజే పీ ప్రభుత్వం స్థానిక ప్రజల హక్కులు, భూమి హక్కులను కాపాడడంపై ప్రధానంగా దృష్టిపెట్టడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు ఓ వైపు 1700 మందికి పైగా మావోయిస్టులు హతం కాగా, మరోవైపు 6,487 మందిని అరెస్టు చేయడం జరిగింది. 11,413 మంది లొంగిపోయారు. అయితే మావోయిస్టులు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లు జరగడంపై విమర్శ లు వస్తున్నాయి.
ఉద్యమం బలహీనమైనందున మావోయిస్టులతో చర్చలకు ఎందుకు ప్రయత్నించడం లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పు డు చూపిస్తున్న దూకుడును గమనిస్తే చర్చలకు అవకాశమే లేదని అర్థమవుతుంది. గత పదేళ్లలో మొత్తం 343 మంది మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఇదే భద్రతా బలగాలకు వరంగా మా రింది. నక్సల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని ఏరివేస్తున్నారు.