09-05-2025 04:29:55 PM
హైదరాబాద్: నేషనల్ డిఫెన్స్ ఫండ్(National Defense Fund)కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం ఇవ్వాలని సీఎం కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విరాళం ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే, భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచపటంలో పాక్ ఉనికి లేకుండా చేయగలరని రేవంత్ రెడ్డి ఉగ్రవాదులను హెచ్చరించారు. భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే. వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్దతుగా వారి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి ముందుండి ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పుష్పాంజలి ఘటించారు.