09-05-2025 05:41:39 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ ఢిల్లీ వ్యాప్తంగా అధికారులు హైరైజ్ భవనాలపై సైరన్లు ఏర్పాట్లు చేసి ప్రయోగాత్మకంగా కాసేపు మోగించారు. భద్రతా దళాలు సైరన్ మోగించి ఢిల్లీ పౌరులను అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు సైనికుల చర్యలు, కదలికలపై సంయమనం పాటించాలని రక్షణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లు జాగ్రత్తగా వ్యవహరించాలని, సమాచారాన్ని బహిర్గతం చేస్తే భద్రతాదళాల ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ శాఖ పేర్కొంది. సంబంధిత అధికారులే బ్రీఫింగ్స్ ఇచ్చేందుకు అర్హులని తెలిపింది.
అటు భారత్ నుంచి పాకిస్తాన్ కు మరో ముప్పు పొంచి ఉంది. జమ్ముకశ్మీర్ లో అకాల వర్షాలకు సింధు ఉప నది చినాబ్ లో నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు వెల్లడించారు. సలాల్, బాగ్లీహర్ డ్యాముల నుంచి రెండు గేట్లు ఎత్తివేతతో దిగువకు నీటీ ప్రవాహం పోటెత్తింది. దీంతో పాకిస్తాన్ లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టులు, టెర్మినల్స్, నౌకలకు భద్రతను రెండో స్థాయికి పెంచుతు ఆదేశాలు జారీ చేసింది.
ఇస్రో కేంద్రాల దగ్గర కేంద్రం హైఅలర్ట్ ప్రకటింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీహరి కోట, బెంగళూరు సహా 11 ఇస్రో కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేస్తూ సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించాలని లేఖలో పేర్కొంది. రూల్ 11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అవసరమైతే అత్యవసర అధికారాలు ఉపయోగించుకోవాలని లేఖలో వెల్లడించింది.