calender_icon.png 11 October, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుధ్య చర్యల్లో నిర్లక్ష్యాన్ని సహించం

11-10-2025 12:15:11 AM

మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య

ఖమ్మం, అక్టోబరు 10 (విజయక్రాంతి):నగర పరిసరాల శుభ్రతలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. నగర పారిశుధ్య కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. నగరంలోని కాలువొడ్డు ప్రాంతం, కరుణగిరి బ్రిడ్జ్, వైరా రోడ్ బైపాస్ రోడ్ మరియు బల్లేపల్లి రోడ్డును సందర్శించి పారిశుద్ధ్య పనులను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ నగర పరిసరాల శుభ్రతలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టంగా తెలిపారు. రోడ్లపై ఎక్కడైనా సి & డి (కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్) వేస్ట్ లేదా ఎంక్రోచ్మెంట్ కనిపించిన వెంటనే సంబంధిత వ్యక్తులపై జరిమానాలు విధించవలసిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.రోడ్ల పక్కన పెరిగిన పొదలు తరచుగా క్లీన్ చేయాలని, రోడ్లపై మురికి లేదా మట్టి పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు.

నగరంలోని ప్రతి డివిజన్లో ఆటో మరియు ట్రాక్టర్ ప్రతిరోజు హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ చేయడం తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ స్పష్టంగా ఆదేశించారు. రోడ్డు మరమ్మతులు అవసరమైన చోట తక్షణమే ఇంజనీరింగ్ విభాగం చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని బ్రిడ్జ్లు మరియు డ్రైన్లు శుభ్రంగా ఉండేలా నిరంతరం మానిటరింగ్ చేయవలసిందిగా శానిటేషన్ అధికారులకు ఆదేశించారు.

ఖమ్మం నగరంలో కొనసాగుతున్న నిర్మాణ కార్యకలాపాల వద్ద ఇసుక, కంకర, సిమెంట్ మరియు సి & డి వేస్ట్ రోడ్లపై పేరుకుపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా రోడ్లపై ఇసుక, కంకర లేదా సి & డి వేస్ట్ ఉంచినట్లయితే ఆ బిల్డింగ్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అలాగే ఫుట్పాత్లపై ఎక్కడా వాహనాలు నిలపరాదని, ఫుట్పాత్లను ప్రజల సౌకర్యం కోసం ఖాళీగా ఉంచాలని హెచ్చరించారు. ఫుట్పాత్లపై వాహనాలు నిలిపిన షాప్ యజమానులు లేదా బిల్డింగ్ యజమానులకు సంబంధించిన వాహనాలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదని కమిషనర్ స్పష్టం చేశారు.

మున్సిపల్ కమిషనర్ నగర శుభ్రత, రోడ్ల సదుపాయాలు మరియు ప్రజా సౌకర్యాలపై మరింత నాణ్యతతో పనులు చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు మున్సిపల్ శాఖ పూర్తి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని కమిషనర్ తెలిపారు.