calender_icon.png 18 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ పెళ్లి.. భర్త, అత్త వేధింపులతో నవ వధువు బలి

18-12-2025 07:17:05 PM

శవాన్ని వదిలేసి పరారైన భర్త..

తాండూరు (విజయక్రాంతి): అవును.. వారిద్దరు ప్రేమించుకున్నారు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రియురాలితో ప్రమాణం కూడా చేశాడు.. పెద్దలను ఎదిరించి, ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. మోజు తీరాక కట్నం, బంగారం తీసుకురావాలంటూ భార్యను భర్త, అత్త కలిసి శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేసి భర్త కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ నవవధువు నేలరాలింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామానికి చెందిన అనూష(22) సాయిపూర్ నివాసి అయిన పరమేష్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో అనూష కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు.

ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని అనూష మొండికేయడంతో ఒప్పుకున్న తల్లిదండ్రులు బంగారం నగదు ఇచ్చి 8 నెలల క్రితం పెళ్లి ఘనంగా చేశారు. అదనంగా కట్నం తీసుకురావాలని అనూషకు భర్త పరమేష్ తో పాటు అత్త నిత్యం వేధించేవారు. కుటుంబ పెద్దల సమక్షంలో ఇరువురిని సముదాయించి అనూషను అత్తారింటికి పంపారు. అయితే గతం బుధవారం రాత్రి అనూషను భర్త, అత్త ఇద్దరు కలిసి తీవ్రంగా కొట్టడంతో ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి భర్త, అత్త ఇద్దరు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు గురువారం ఉదయం వచ్చి చూసే సరికి అప్పటికే అనుష మృతిచెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని బంధువులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.