15-07-2025 12:00:00 AM
టెన్నిస్‌లో కొత్త శకం మొదలైంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈసారి కొత్త చాంపియన్స్ అవతరించారు. పురుషుల విభాగంలో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ విజేతగా నిలువగా, మహిళల విభాగంలో పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచారు. వీరద్దరూ గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం కొత్తేం కాదు.. కానీ ఈసారి వింబుల్డన్‌కు ఒక విశేషముంది. ఈ ఇద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం.
అలాగే తమ దేశాల తరఫున తొలి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆటగాళ్లు గానూ సిన్నర్, స్వియాటెక్ రికార్డులకెక్కారు. శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో స్వియాటెక్ 6-0, 6-0 తేడాతో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాపై విజయం సాధించారు. అలా తొలిసారి టైటిల్ అందుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో 4-6, 6-4, 6 6-4తో స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్‌పై విజయం సాధించిన సిన్నర్ కెరీర్‌లో తొలి వింబుల్డన్ సాధించారు.
ఉత్తర ఇటలీలోని సాన్ కాండిడోలో జన్మించిన సిన్నర్‌కు చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే ప్రాణం. 23 ఏళ్ల వయస్సులోనే సిన్నర్ వింబుల్డన్ టైటిల్ సాధించారు. గతంలో ఇటలీకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు వింబుల్డన్ ఆడి చివరి దశలో బోల్తా కొట్టారు. 2021లో జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో మాటియో బెరెట్టిని సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అలా తృటిలో టైటిల్ చేజారింది. గతేడాది వింబుల్డన్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పవోలిని చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బోరా క్రెజికోవా చేతిలో ఓటమి పాలవ్వడంతో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవడంలో ఆమె విఫలమయ్యారు. అలా గతంలో సీనియర్లకు సాధ్యం కానిది, సిన్నర్ చేసి చూపించడంతో అతని పేరు ప్రపంచమంతా మార్మోగింది.
నెలన్నర క్రితం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఐదు గంటల ఉత్కంఠ పోరు తర్వాత అల్కరాజ్ చేతిలో ఓడిన సిన్నర్.. తాజాగా వింబుల్డన్ ఫైనల్స్‌లో అల్కరాజ్‌ను ఓడించి అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు సిన్నర్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ అందుకోగా.. వాటిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండుసార్లు, యూఎస్ ఓపెన్, వింబుల్డన్ ఒక్కోసారి నెగ్గారు.
సిన్నర్ లాగానే మహిళల సింగిల్స్ విభాగంలో స్వియాటెక్‌కు కూడా వింబుల్డన్ టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. పోలండ్ తరఫున ఆడి, వింబుల్డన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా స్వియాటెక్ చరిత్ర సృష్టించారు. మహిళల టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (2002) తర్వాత అత్యంత పిన్న వయస్సులో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్న క్రీడాకారిణిగానూ రికార్డు సాధించారు.
స్వియాటెక్ కెరీర్‌లో నాలుగు ఫ్రెంచ్ ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్.. తాజాగా వింబుల్డన్ వచ్చి చేరింది. అంతేకాదు.. అమెరికాకు చెందిన మోనికా సీల్స్ (1992) తర్వాత స్వియాటెక్ తాను తొలి సారి ఆడిన ఆరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం మరో విశేషం. ఈసారి వింబుల్డన్‌లో స్వియాటెక్ తన ఫైనల్ మ్యాచ్‌ను కేవలం 57 నిమిషాల్లోనే ముగించడాన్ని చూస్తే, ఆమె ఎంత దూకుడుగా ఆట ఆడారో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు టెన్నిస్ అనగానే పురుషుల విభాగంలో రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్, నొవాక్ జొకోవిచ్.. మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్, స్టెఫీ గ్రాఫ్, మార్టినా నవ్రతిలోవా గుర్తుకు వచ్చేవారు. కానీ, ఇప్పుడు కళాత్మక ఆటకు దూకుడు జతచేసిన ఆటగాళ్లు కొత్తగా పుట్టుకొస్తున్నారు. ఈ తరంలో పురుషుల విభాగంలో సిన్నర్, అల్కరాజ్, మహిళల విభాగంలో స్వియాటెక్, సబలెంకా, కోకో గాఫ్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో సత్తా చాటుతున్నారు.