29-12-2024 12:00:00 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు కష్టాలు సైతం ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీకోటపై మూడోసారి ఆప్ జెండా ఎగరేయడానికి శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న మాజీ సీఎంకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇటీవల అనుమతించడం ఆమ్ ఆద్మీపార్టీకి షాక్‌గా మారింది.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సక్సేనా ఈడీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని మండిపడుతోంది. వాస్తవానికి రెండేళ్లుగా లిక్కర్ స్కామ్ ఆప్‌ను వెంటాడుతూనే ఉంది. కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ కుంభకోణంలో భాగంగా సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో జైలు పాలయ్యారు. వీరిలో చాలామందికి బెయిలు లభించినప్పటికీ మళ్లీ కొత్త కేసులు, అరెస్టులు ఉండవచ్చన్న భయాలను ఇటీవల కేజ్రీవాల్ వ్యక్తం చేశారు కూడా.
వీటన్నిటనీ ఎదుర్కోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి తాజాగా మహిళలకు ప్రతినెలా రూ. 2,100 ఇచ్చేందుకు ‘మహిళా సమ్మాన్ యోజన’, సంజీవని యోజన పేరుతో సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందించేందుకు రెండు కొత్త పథకాలను ప్రకటించారు. వీటికోసం ఆప్ కార్యకర్తలు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఇదే ఇప్పుడు కేజ్రీవాల్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీనిపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఎల్‌జీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఇదంతా బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త రాజకీయం అంటూ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లడానికి సిద్ధమేనంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
నిజానికి గత కొద్ది రోజులుగా ఢిల్లీ రాజకీయాల్లో చోటు చేసుకున్న అనేక పరిణామాలు కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటిదాకా బీజేపీతోనే తమకు ముఖాముఖి పోటీ ఉంటుందని ఆయన భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ను పోటీదారుగానే ఆయన గుర్తించలేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకూ ఆయన ఇష్టపడలేదు.
అయితే ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ కూటమికి నేతృత్వం వహిస్తున్న తమను దూరం పెట్టడం సహజంగానే కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఒకప్పుడు తమ కంచుకోటగా ఉన్న దేశ రాజధానిలో తమ సత్తా ఏమిటో చాటాలని ఆ పార్టీ ఇప్పుడు కంకణం కట్టుకుంది. అందుకే బీజేపీకన్నా కూడా కేజ్రీవాల్ పార్టీపైనే విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది.
అంతేకాదు కేజ్రీవాల్ సహా కీలక నేతల నియోజకవర్గాల్లో బలమైన నేతలను బరిలోకి దించింది. అంతేకాదు, పదేళ్ల ఆప్ పాలనపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. అన్నిటికీ మించి 2013లో ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తమ పార్టీ చేసిన పెద్ద తప్పని, 15 ఏళ్ల పాటు దేశ రాజధానిలో తిరుగులేని శక్తిగా ఉన్న తమ పార్టీ పట్టు కోల్పోవడానికి అదే కారణమైందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలు కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం మింగుడు పడలేదు.
కూటమినుంచి కాంగ్రెస్‌ను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేసేలా చేసింది. కాంగ్రెస్ వైఖరితో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీకి రంగం సిద్ధమయిందని విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ ఎంతగా బలపడితే అంతగా ఆప్‌కు నష్టం వాటిల్లుతుందనేది అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఇప్పటివరకు ఆప్‌కు బలమైన ఓటుబ్యాంక్‌గా ఉన్న దళిత, ముస్లిం మైనారిటీ ఓట్లను ఎక్కడ కాంగ్రెస్ ఎగరేసుకుపోతుందోనని కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. అదే జరిగితే బీజేపీ లాభపడుతుంది. ఇదే కేజ్రీవాల్‌ను కలవరపెడుతున్న అంశం. అటు సక్సేనా, ఇటు బీజేపీ, కాంగ్రెస్‌లనుంచి ఎదురవుతున్న ముప్పేట దాడిని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.