calender_icon.png 4 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటాలి

04-08-2025 01:05:24 AM

-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలి

-గులాబీ జెండా మళ్లీ ఎగరాలి

-బీజేపీ, కాంగ్రెస్‌వి కుమ్మక్కు రాజకీయాలు

-కాంగ్రెస్ నేతల ఇండ్లన్నీ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే..

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాం తి): త్వరలో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి గులాబీ పార్టీ సత్తా  చాటాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నా రు. ఏడాదిన్నర కాంగ్రెస్ మోసాన్ని చూసి న తరువాత కూడా  కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాల ని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిర స్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉందని, ఉప ఎన్నికలో మళ్లీ గులాబీ పార్టీ అభ్యర్థి గెలవాలన్నారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా మరొక్కసారి జూబ్లీహిల్స్‌లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏడాదిన్నర కాంగ్రెస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి  ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

కాంగ్రెస్ మోసానికి తెలంగాణ ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు.  కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆగిపోయాయని విమర్శించారు. ఎన్నికల ముదు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేవంటి నాయకులంతా వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలిచిన తరువాత అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేసినా ఇప్పుడు ఉన్న పథకాలన్నీ పోతాయని హెచ్చరించారు. ప్రతి కార్యకర్త 100 ఓట్లకు ఒకరు, 25 ఇళ్లకు ఒకరు చొప్పున పనిచేయాలన్నారు. తమ పాలనను కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. 

 ఎఫ్‌టీఎల్ పరిధిలోనే రేవంత్ ఇల్లు

అబద్దపు హామీలతో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందని, హైడ్రా పేరుతో బస్తీల్లో పేదల ఇండ్లను కూల్చుతున్నదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు కట్టుకున్నాడని, హైదరాబాద్‌లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ నేతల ఇండ్లన్నీ కూడా బఫర్, ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రా యితీస్తా అన్నట్లుగా రేవంత్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌వి కుమ్మక్కు రాజకీయాలు

కాంగ్రెస్, బీజేపీల ఏకైక ఎజెండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను ఓడించడమేనని కేటీఆర్ అన్నారు. అందుకే ఈ రెండు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దని, గెలుస్తామని ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాగంటి గోపీనాథ్ బీఆర్‌ఎస్‌ను వీడలేదని, ఉప ఎన్నికలో గెలిచి గోపీనాథ్‌కు అంకితమివ్వాలని పిలుపునిచ్చారు.